(దండుగుల శ్రీనివాస్)
జర్నలిజం అంటే అంతే. ఒక్కసారి అంటుకుందా.. గజ్జి తామరకు మించిన గోకుడు. సమ్మగా ఉంటుంది. ఆ మర్యాదకు అలవాటుపడతాం. ఆ వాతవరణానికి జీ హుజూర్ అంటాం. అహం ఇంకా పెరుగుతుంది. దురవాట్లు జీవితంలో ఓ భాగంగా మారుతాయి. ఆరోగ్యం అటకెక్కుతుంది. ఆనారోగ్యం నిత్యం కాటేస్తూ.. రోజు రోజుకు చంపుతూ ఉంటుంది. ఎప్పుడు ఆ శరీరం కుప్పకూలుతుందో తెలియదు. లోపల ఆర్గాన్స్ ఎట్లెట్ల అంతమవుతాయో మన ఊహకు అందదు. పొద్దున లేస్తే టిప్ టాప్‌గా రెడీ కావాలె. ఆఫీసర్లు దండం పెట్టే సీన్లు, చాయ్, టిఫిన్ల దగ్గర నుంచి రాత్రి మందు దావత్‌ల దాకా ఫ్రీగా ఇచ్చే వచ్చే ఫాల్స్ పరపతి, మర్యాద.. మనకు తెలవకుండానే మన మనస్సును, శరీరానికి చెదలు పట్టిస్తున్నాయనే సోయి మనకప్పుడు తెల్వదు. ఇంట్లో పెండ్లాం పిల్లల బాగోగులు పట్టవు. అసలు కనీస అవసరాలు కూడా సమకూర్చలేని అసమర్థత కళ్ల ముందే కదలాడుతూ ఉంటుంది. నిత్యం వెక్కిరిస్తూ ఉంటుంది.
అయినా మనం తగ్గేదే లేదన్నట్టు.. ఆ జర్నలిజంను విడవం. ఆ రాతలో కైపుంటుంది. ఆ పదవిలో ఓ ఊపుంటుంది. దాని ద్వారా వచ్చే మర్యాదలో మత్తుంటుంది. అది గంజాయికి మించి కిక్కునిస్తుంది. పని ఒత్తిడి పేరుతోనే.. ఇంకేదో సాకుతోనే నిత్యం తాగాలె. మితిమీరుతున్నామని తెలిసినా.. డోంట్ కేర్. ఆరోగ్యం పాడయిపోతుందనే సంకేతాలున్నా.. సంకనాకిపోతామనే హెచ్చరికలు వస్తున్నా.. మనం వినం. ఎందుకంటే జర్నలిజం అంటే అంతే మరి. మనం పుట్టిందే జర్నలిస్టులుగా. చచ్చేది కూడా జర్నలిస్టుగానే. ఆ మర్యాద మనకు కావాలె. అది అకాల మరణం కాదు. వీర మరణం. జాతి కోసం మనకు మనం సమర్పించుకుంటున్నాం మన ప్రాణం. సమాజానికేదో మేలు చేసేస్తున్నామని బిల్డప్‌లో మనకు మనం మాస్క్ తొడుక్కుని మనంతో పాటు మనల్ని నమ్ముకున్నవారికీ సమాధి కట్టే ఈ జర్నలిజం వర్దిల్లాలి. కొత్త కొత్త వారు ఈ రంగాన్ని ఎంచుకోవాలి. త్యాగాలకు సిద్దం కావాలి. అర్థాంతరంగా చావాలె.
Dandugula Srinivas
8096677451