(దండుగుల శ్రీ‌నివాస్‌)

గ‌జిని ఫార్మూలాను కాపీ కొడ‌దామ‌నుకొని గ‌జ్జి క‌థ‌ను ఎంచుకున్నట్టుంది. వైద్య‌శాస్త్రంలోని మెంట‌ల్ డిజార్డ‌ర్ లో ఏదో ఒక మాన‌సిక రోగం ఎంచుకుని, దాని చుట్టూ క‌థ అల్లుకుని, ఓ సందేశాన్ని మిలితం చేసి, కొంచెం థ్రిల్లింగ్ మిక్స్ చేసి, ఫైట్లు యాడ్ చేసి అలా జ‌నాల మీద‌కు వ‌ద‌ల‌డం అర‌వం డైరెక్ట‌ర్ల‌కు అల‌వాటే. శంక‌ర్ తీసుకున్న ఫార్మూలాలోనే మురుగ‌దాస్ కూడా వెళ్తున్నాడు. కొంచెం భిన్నంగా. అయితే ఈ ఇద్ద‌రి ట్రెండ్ ముగిసింది. ఈ మూస క‌థ‌ల‌కు కాలం చెల్లింది. లాజిక్కులు లేని ప్రాక్టిక‌ల్‌కు దూరంగా ఉండి, ప్రేక్ష‌కుడిని క‌థ‌లోంచి బ‌య‌ట‌కు లాగి, ఎటెటో తిప్పి తిప్పి త‌ల తిరిగేలా చేసి అలా వ‌దులుతార‌న్న మాట‌. అచ్చం అలాగే ఉంది… తాజాగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ‌యిన మ‌ద‌రాసి.

సినిమా పేరును ఎంచుకోవ‌డంలోనే అర‌వం పిచ్చి పీక్‌కు పోయింద‌నే చెప్పాలె. క‌థ‌లో త‌మిళ‌నాడు జ‌నం బాగానే చేశాడు. మూల‌క‌థ‌కు ప్రాణ‌మైన గ‌న్ క‌ల్చ‌ర్ విస్తృతి, డెల్యూష‌న‌ల్ డిజార్డ‌ర్ … ఈ రెండూ పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌కు ఇంట్ర‌స్ట్‌లేని స‌బ్జెక్టులే అనిపించాయి.

అందుకే క‌థ‌లో మొద‌ట్లోనే కిక్ పోయింది. ఇక దాన్ని లాక్కొచ్చేందుకు డైరెక్ట‌ర్ ప‌డిన తాప‌త్ర‌యం అంతా ఇంతా కాదు. క్లారిటీ మిస్ అయ్యింది. త‌ను అల్లుకున్న క‌థ‌లో సాలెగూడులో ఆ సాలెపురుగే చిక్కుకుని విల‌విల‌లాడి చ‌చ్చిన‌ట్టుగానే ఉంది క్లైమాక్స్ వ‌ర‌కు సినిమా. త‌మిళ‌నాడు పోలీసుల గురించి బాగానే డ‌ప్పు కొట్టుకున్నాడు. ఆ రాష్ట్రంలోనే శాంతి భ‌ద్ర‌త‌లు బాగున్నాయ‌ట‌.. గ‌న్ క‌ల్చ‌ర్ అస‌లే లేద‌ట‌.. ఈ విష‌యం చెప్ప‌డం ద్వారా మిగిలిన రాష్ట్రాల‌ను చీప్‌గా తీసి పారేశాడు ముర‌గ‌దాస్‌. అనురిధ్ సంగీతం పాట‌ల‌క‌న్నా.. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్‌కే ప‌నికి వస్తాడ‌నిపిస్తుంది. పాట‌లు పెద్ద‌గా విన‌సొంపుగా లేవు. అర‌వం వాస‌న అందులోను. ఇక బీజీఎంను చెవుల్లోంచి ర‌క్తం వ‌చ్చేలా తుక్కు తుక్కు కొట్టి వ‌దిలేశాడు బ‌క్కోడు.

మెయిన్ విల‌న్ విద్యుత్ జ‌మ్వాల్ యాక్ష‌న్ సీన్స్ అదిరాయి. ఈ విల‌న్‌ను చూపించిన దాంట్లో… కూలీలో లోకి.. నాగ్‌ను ప‌ది శాతం కూడా చూప‌లేదు. హీరో పాత్ర ఎలివేట్ కావాలంటే విల‌న్ ఎంత బ‌ల‌వంతుడో, క్రూరుడో చూప‌గ‌లిగితేనే క‌దా.. కానీ కూలీలో అది మిస్ అయ్యింది. ఇంతోటి దానికే నాగ్ , నాగ్ అభిమానులు అదేదో అద్భుత‌మైన పాత్ర చేశామ‌ని చంక‌లు గుద్దుకున్నారు. ఓసారి నాగ్ ఈ విల‌నీ కోస‌మైనా మ‌ద‌రాసి చూడాలి.

Dandugula Srinivas

8096677451

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed