(దండుగుల శ్రీనివాస్)
అబద్దాలు విచ్చలవిడిగా ఆడాలి. అధికార పార్టీని అభాసుపాలు చేయాలె. ఇదే ఇప్పుడు రామన్న తారకమంత్రం. అందుకే రోజుకో అబద్దం… పూటకో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం.. ఈ అబద్దాలతో అధికార పార్టీని అభాసుపాలు చేయాలని. కానీ తనే అభాసుపాలవుతన్నట్టు ఆయన గ్రహించడం లేదు పాపం. మొన్నటి దాకా ఓ అబద్దాన్ని ప్రచారం చేశాడు. కాళేశ్వరం పిల్లర్ కుంగింది… కాంగ్రెస్ వాళ్లు బాంబులు పెట్టి లేపేయడం వల్లేనని ధ్రువీకరించాడు. ఇంజినీరింగ్ అద్భుతమైన కాళేశ్వరం కుంగడమేమిటండీ….విచిత్రం కాకపోతే.. అది కాంగ్రెస్ వాళ్లే కుట్రే. దాన్ని బాంబులు పెట్టి పేల్చడం వల్లే ఆ ఒక్క పిల్లర్ కుంగింది… అన్నాడు. దీన్ని బీఆరెస్ శ్రేణులంతా తానా అంటే తందానా అని వంత పాడినయ్. మొన్నటికి మొన్న పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టుకు పోయిన వీళ్లే… వానాకాలం కదా.. అందులోనూ ముందస్తు వానలు కదా.. అందుకే పెద్ద వానలకు ఆ పిల్లర్ కుంగింది.. యువరానర్! అని పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ అభాసుపాలైంది ఎవరు..?
మళ్లా ఇవ్వాళ్లన్నాడు. ఏమని? కాళేశ్వరంలో కుంగిన ఆ పిల్లర్‌ను ఎందుకు రిపేర్ చేయడం లేదో తాను రహస్యం తెలుసుకున్నాడట. ఏమని? కేంద్రంలో బీజేపీ పెద్దలు..అంటే అదేనండి.. మోడీ.. సీఎం రేవంత్‌రెడ్డితో చెప్పాడట. ఏమని? ఆ పిల్లర్ రిపేర్ చేయొద్దు.. చేయకపోతే గోదావరి నీళ్లన్నీ అలా అలా ఆంధ్రకు పోతాయి.. అక్కడ బనకచర్ల ప్రాజెక్టు కడుతున్నారు కదా.. వారికి అది మేలు చేస్తుంది.. అని చెప్పాడట. అందుకే సీఎం దాన్ని రిపేరు చేయడం లేదట. ఇదేమన్నా నమ్మశక్యంగా ఉందా? ఈ అబద్దాలతో అభాసుపాలైతుంది ఎవరు??
తాము ఓడిపోయి.. అధికారం కోల్పోగానే కేటీఆర్ రియలైజ్ అయ్యాడు. ఏ విషయంలో అంటారా? తాము ఓ 300 యూట్యూబ్ చానళ్లు ఏర్పాటు చేసుకునే ఉంటే బాగుండేదని. దాని ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని. తాము ఓడామని. అంటే జనాలు అంత వెర్రివాళ్లా..? అదే కదా కేటీఆర్ అర్థం. అందుకేనేమో.. ఇప్పుడు కేటీఆర్ సోషల్ మీడియానే నమ్ముకున్నాడు. తమ మానస పుత్రిక నమస్తే తెలంగాణను కూడా గుమస్తా కన్నా అధ్వానంగా చూస్తన్నాడు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియా టైగర్. అదే ఆయనను భవిష్యత్తులో సీఎంను చేసే ఓ అద్భుత వేదిక. జనంతో పనిలేదు. జనం ఏమనుకుంటున్నారో అసలే అక్కరలేదు. లోపాలు గుర్తించడు. అహంకారం వీడడు. ఒక్క సోషల్‌మీడియానే తనను అన్నీ.. అందుకే ఈ అబద్దాలు… అభాసుపాలు. ఏం చేస్తే ఏం.. సీఎం కావాలి. అంతేకదా. అంతేగా… అంతేగా..!
Dandugula Srinivas
Senior Journalist
8096677451