వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్:
ఆమె తండ్రికి సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారాయన. ఎమ్మెల్యే కావాలనేది ఆయన కల. అవకాశాలు వచ్చాయి. కానీ కాలం కలిసిరాలేదు. కొన్నిసార్లు అవకాశాలు దగ్గర దాకా వచ్చి ముఖం తిప్పేశాయి. అయినా ఓపిక పట్టాడు. జనంతోనే కలిసి ఉన్నాడు. రాజకీయమమే పరమావధిగా, ప్రజాసేవే లక్ష్యంగా జీవించాడు. కానీ ప్రజాసేవలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఎమ్మెల్యేనయి.. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆయన కోరిక నెరవేరకుండానే కన్నుమూశారాయన. ఇప్పుడా ఆ తండ్రి బిడ్డగా, ఆలూరు గంగారెడ్డి పేరును నిలబెట్టేందుకు ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జనం లీడర్‌గా, డేరింగ్ అండ్ డాషింగ్ నాయకురాలిగా ఆర్మూర్ గులాబీ గడ్డపై తన ముద్ర వేసేందుకు రంగంలో దిగింది విజయ భారతి.
ఊరు పేరునే ఇంటిపేరుగా మార్చుకుని ఇందూరు రాజకీయంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుని, జనం గుండెల్లో నిలిచిపోయిన ఆలూరు గంగారెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఎమ్మెల్యేగా గెలిచి తన తండ్రి తీరని కోరికను నెరవేర్చాలనే లక్ష్యంతో కంకణబద్దురాలై ఆమె గులాబీ దండులో భాగస్వామ్యం కాబోతున్నది. ఆర్మూర్ గులాబీ శ్రేణులో నిండుకున్న తీవ్ర నైరాశ్యాన్ని దూరం చేసి నేనున్నాననే భరోసాను నింపగలుగుతున్నదామె. అంధకారబందూరంగా మారిన ఆ నియోజకవర్గ గులాబీ బంధువులకు ఊతకర్రగా నిలిచి తోడునీడై నడవనుందామె. ఆర్మూర్ గులాబీకి నవశకాన్ని రచించేందుకు సిద్దమైంది ఆమె. ఆమె రాకతో ఆర్మూర్ రాజకీయాల్లో ఓ ప్రకంపన. ప్రత్యర్థుల్లో ఓ చలనం. కదలిక. గులాబీ సేనలో నూతనోత్తేజం. ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పట్నుంచొక లెక్క.. అన్నట్టుగానే ముందుకు సాగుతుందామె గులాబీ సేన తోడురాగ.