(దండుగుల శ్రీనివాస్)
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.. ఇది అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరిగ్గా నప్పుతుందేమో! చట్టలెన్ని తెచ్చినా… అవినీతి పేరిటి ఎన్ని దాడులు జరిగినా చివరకు దీని వెనుక అధికార పార్టీ మంత్రం లొంగుబాటే అయి ఉంటుంది. ఎదుటోడు ప్రతిపక్షమైతే అన్నీ నిందలే. వాడంత లంగ లఫంగ ప్రపంచంలో ఇంకెవడూ ఉండడనే విధంగా అధికార పార్టీ తిట్లదండకం ఉంటుంది. వాడే వీడైతే.. ఆ అవినీతిపరుడే మన ఇంట్లో జొస్తే… వెంటనే పాప ప్రక్షాళన గావించబడుతుంది. ఒక్కసారిగా అతగాడు పునీతుడైపోతాడు. అప్పటి వరకు మురికికూపమైన వాడి రాజకీయం పావనమైపోతుంది. ఇదే కదా అప్పటి నుంచి ఇప్పటి దాకా నడుస్తున్న అధికార రాజకీయం.
అధికారం కోసం రాజకీయం. ఇప్పుడు కొత్తగా పదవీచ్యుత చట్టానికి కూడా నిబంధనలు వర్తిస్తాయి. ఆ నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకునే వెలుసుబాటూ ఉంటుంద. ఎటొచ్చి.. మన ఇంట్లోకి రాకుండా ఉన్న ప్రతిపక్షపోడికి మాత్రం రాజకీయమే లేకుండ చేయాలె. రాజకీయ సన్యాసం తీసుకోవడమే మేలురా అనిపించేలా చట్టాన్ని అస్త్రంగా వాడాలె. అందులోనే ఉంది మతలబంతా. ఒకవేళ.. సపోజ్.. పర్ సపోజ్.. బాగా అవినీతిపరుడు, జైలు ఊచలు లెక్కించి లెక్కించి చేతులు నొప్పెట్టిన ఓ బడా పేరు మోసిన లీడర్… మన పార్టీలో చేరితే… మరి అప్పటిదాకా ఈ నోరే కదా వాడిని తిట్టి తిట్టీ మలినమైపోయింది. వాడితో పాటు మన నోరు కూడా వాడు పార్టీలో చేరగానే పావనమైపోతుందన్నమాట. అవును.. ఇవన్నీ దేశం కోసం.. ధర్మం కోసం అని సరిపెట్టుకుంటే పోలా..! దీని లాజిక్కులు.. మేజిక్కులు అంటూ లెక్కలు తీసి..లోతుల్లోకి పోయి.. దిమాఖ్ కరాబ్ చేసుకునుడు తప్ప.