(దండుగుల శ్రీనివాస్)
హసిత భాష్పాలు పుస్తక ఆవిష్కరణ సభ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఓ వైపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లపై విచారణల పర్వం కొనసాగుతోంది. అవినీతి, అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ విచారణలు ఇక క్లైమాక్స్‌కు చేరే టైమ్‌లో.. సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నదనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో.. సీఎం చేసిన కర్మ సిద్ధాంతం కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. తనెవరినీ వెంటాడబోనన్నారు. వేటాడనని కూడా చెప్పారు. తను కర్మ సిద్దాంతాన్ని బలంగా నమ్ముతానని చెప్పిన ఆయన.. ఎవరి పాపం వారినే వెంటాడుతుందన్నారు. చేసిన పాపాలకు ఫలితం తప్పక అనుభవిస్తారని వేదాంతం పలికిన సీఎం.. కేసీఆర్‌నుద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనేది సుస్పష్టం.
నేను ఎవరిని శత్రువు గా చూడను..నేను శత్రువు గా చూడాలంటే వారి కి ఆ స్టాయి ఉండాన్నారాయన. అంటే కేసీఆర్‌కు అంత సీన్ లేదని చెప్పకనే చెప్పారా? తెలంగాణ ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని వారి అభ్యున్నతి కోసం ఉపయోగిస్తానని పునరుద్ఘాటించిన ఆయన.. తనకు నచ్చని వారిపైన అధికారాన్ని ఉపయోగించే మూర్ఖుణ్ణి కాదని కూడా అనడమే ఇక్కడ డిస్కషన్‌కు దారి తీసే అంశంగా మారింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో.. కేసీఆర్‌ను దోషిగా నిలిపిన ఉదంతంలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అంతా భావిస్తున్నారు. ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా క్లైమాక్స్‌కు చేరింది. ఈ-కార్ రేసింగ్ కేసులో ఇప్పటికే పలు దఫాలుగా విచారణ పూర్తయ్యింది.
వీటిల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఇక జైలుకు పోతారనే ప్రచారం కూడా ఊపందుకున్నది. కానీ ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతపై నీళ్లు కుమ్మరించినట్టే అయ్యింది. గతంలో ఢిల్లీలో ప్రెస్మీట్లో కూడా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విలన్లను సినిమా మధ్యలో ఎలా అరెస్టు చేస్తారు..? క్లైమాక్స్‌లో కదా అరెస్టు చేసేది? అనడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పుడు సీఎం కర్మ సిద్దాంత కామెంట్స్.. అసలు క్లైమాక్స్‌లో కూడా అరెస్టులు ఉండవనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. తన గెలుపే తన ప్రత్యర్థులకు దుఃఖం తెచ్చి పెట్టిందన్న ఆయన.. సీఎం గా తాను సంతకం పెట్టడం వాళ్ల గుండెలపైన గీత పెట్టినట్లేనని అన్నారు. అంటే ఇంతకన్నా శిక్షేముంటుందనేది ఆయన అభిమతంగా అర్థం చేసుకోవాలా? వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా పదవిని వాడను,పేదల కోసమే పని చేస్తా…నని సీఎం అన్నారు. కక్ష రాజకీయాలకు ఇక్కడ తావులేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా వెల్లడించినట్లయ్యింది.