(దండుగుల శ్రీనివాస్)
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) డ్రైవ్ పేరుతో తొలగించిన బీహార్ ఓటర్ల జాబితాపై ఈసీపై సుప్రీం సీరియస్ అయ్యింది. రాహుల్‌గాంధీ చేస్తున్న ఓట్ చోరీకి సుప్రీం సపోర్టుగా నిలిచిందనే చెప్పాలి. ఇంత జరిగినా.. ఇక్కడ ఓ మెలిక పెట్టే ప్రయత్నం చేసి మరీ మరీ ఈసీ దొరికిపోయింది. సుప్రీం ఏ చెప్పింది…? తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లను వెల్లడించాలన్నది. చనిపోయారని చెప్పి తొలగించిన .. చాలా మంది మేం బతికే ఉన్నాం రా బాబూ..! అని బయటకు రావడమే ఈసీ డొల్లతనమేందో తేలిపోయింది. దీనిపై ఈసీ చట్టంలో ఎక్కడా తొలగించిన పేర్లు వెల్లడించాలని లేదే? అని నాలుక మడతెట్టింది. దీనిపైనా సుప్రీం వేసిన మొట్టికాయలకు నాలుక్కర్చుకుంది. ఈనెల19 డెడ్‌లైన్ పెట్టి మరీ .. ఓటర్ల జాబితాలో తొలగించిన వారి పేర్లు వెల్లడించాలని చెప్పింది.
చచ్చింది ఈసీ… అదే అదే చచ్చింది గొర్రె. ఇప్పుడు ఆ 65 లక్షల మంది పేర్లను వెల్లడించాలి. కారణాలు చెప్పాలి. అర్హులైన వారు వచ్చి మాకు ఓటు కావాలని అడిగితే ఆధార్ ఆధారంగా ఓటు హక్కు కల్పించాలె. ఇవన్నీ చేయాలి. దీనిపై దేశ వ్యాప్త చర్చ జరుగుతోంది. ఇది ఒక్క బీహార్‌లో బయటకు వచ్చిన పచ్చి నిజాలు. కానీ చాలా చోట ఇదే జరుగుంది. రాజకీయ నాయకుల ఏజెంట్లకు ఇచ్చామని తప్పించుకోవడం, వారు ఓటరు స్లిప్పులు పంచితే తప్ప.. తమకు జాబితాలో ఓటు హక్కు ఉందో లేదో తెలియని స్థితిని ఈసీ కల్పించి పెట్టింది. దీనిపైనా సుప్రీం కోర్టు వేసిన మొట్టికాయలు… తమ పాత సిస్ఠంను, అది ఎలా వక్రమార్గంలో పోతుందో మన కళ్లకు కట్టినట్టే ఉంది. దీనిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ పెద్ద వారే నడుస్తోంది.
దేశంలోని అన్ని వర్గాలు ఓట్ చోరీ అంశంపై స్పందిస్తున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ పోరాటం సక్సెసయ్యిందనే చెబుతున్నారు. కానీ దీనిపై బీజేపీ దాని అనుబంధ సంఘాలు, సోషల్ మీడియా టీమ్ మాత్రం సైలెంట్ అయిపోయింది. ప్రతి చిన్న విషయాన్ని కార్నర్ చేస్తూ కౌంటర్లిచ్చే కాషాయ సోషల్ మీడియా గ్రూపు తేలు కుట్టిన చందంగా ఎందుకు వ్యవహరిస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. వాస్తవానికి, రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ అంశాన్ని ఆధారాలతో సహా చూపినప్పుడే కేంద్రం, ఈసీ స్పందించి ఉంటే సరిపోయేది. ఇప్పుడు సుప్రీం దాకా పోయి మరింతగా బట్టబయలు చేసుకున్నట్టయ్యింది. దోషిలా నిలబడాల్సి వచ్చింది. బీజేపీ ఏం చేసినా, మోడీ ఏం చేసినా.. అది దేశం కోసం, ధర్మం కోసం అనే గుడ్డి నినాదం ఒకటి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే క్రమంలో ఆ టీమ్ అండ్ అనుబంధ సంఘాలు సక్సెసవుతూ వచ్చాయి.
ఇదే ఇక్కడ ప్రమాదకరం. ఏ పని చేసినా.. అది ప్రజల బాగోగుల దృష్టితో కాకుండా.. పేదలకు మేలు జరుగుతుందా? లేదా ? అనే అంశాల ఆధారంగా కాకుండా దేశం కోసం, ధర్మం కోసం అనే గుడ్డి నినాదం అన్నింటికీ ఆపాదించేసి .. అశాస్తీయ పద్దతులకు, అక్రమాలకు ఆలవాలంగా మారే విధానాలను కూడా గంప కింద కమ్మేసే ట్రెండ్‌ను ఇప్పుడు ప్రశ్నించాల్సిన తరుణం వచ్చింది. దేశభక్తిని అడ్డం పెట్టుకుని ఏదైనా చేసేయొచ్చనే నడవడిక, మతం పేరుతో జరిగే నిలదీతల, ప్రశ్నల పరంపరల విధానాలు వివాదాలకు కేంద్ర బిందువులవుతున్నాయి. నిజంగా జనంలో దేశం కోసం, ధర్మం కోసం ఏమి చేస్తున్నారో తెలిసి ఉన్నప్పుడు, కేంద్రం జనంపై విశ్వాసంతో ఉన్నప్పుడు, జనామోదం తమకే ఉందనే గట్టి నమ్మకం ఉన్నప్పుడు ఇలా ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు, చూపిన లోపాలకు, దోషులుగా నిలబెట్టే సందర్భాలకు.. తగిన సమాధానం ఇస్తే సరిపోతుంది. తప్పు సరిదిద్దుకున్నామని చెబితే హుందాతనంగా ఉంటుంది. కానీ ఇక్కడ రాజకీయమే ముఖ్యమైంది. అందుకే ఓట్ చోరీ వివాదం సుప్రీం దాకా పోయింది.