Dandugula Srinivas
ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి రథసారథి. సమాజాన్ని మేల్కోల్పిన ప్రొఫెసర్ కోదండరామ్.. రాజకీయాలలో ఓ ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోతున్నాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినాటి నుంచి అడగడుగునా కష్టాలు, అవమానాలు. రాజకీయంలో వ్యూహంలొ లోపం శాపంగా మారింది. సామాజిక సేవకుడిగా, రాజకీయ నాయకుడిగా రెండింట్లో స్పష్టత లేక ఆయన ఇబ్బంది పడ్డారు. తాజాగా వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు .. ఆయనను మరింత కుంగదీసింది.
ఆయన అందరివాడు మొన్నటి వరకు. జయశంకర్ సార్ తరువాత తెలంగాణ కోసం ఓ స్టాండ్‌తో నిలబడి, విలువలు, సిద్దాంతాలు కలిగిన నాయకుడిగా జనం గుర్తించారు. అదే స్థాయిలోగౌరవాన్నీ ఇచ్చారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే మెల్లగా అంతరం ఏర్పడింది. దీనికి కారణమూ కేసీయారే.అయితే తొలినాళ్లలో కేసీఆర్‌ను పెద్దగా విభేదించలేదు కోదండరామ్. కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం.. వెంటనే వ్యతిరేతకంగా మాట్లాడలేకపోయాడు. మిషన్ కాకతీయ లాంటి పథకాలను తప్పనిసరిగా కీర్తించాల్సిన సందర్భం అప్పుడు ఆయనలో ఏర్పడింది. ఆ తరువాత మెల్లగా మరింత అంతరం పెరుగుతూ వచ్చింది కేసీఆర్‌కు, కోదండరామ్‌కు. కేసీఆర్ అందరినీ వాడుకుని వదిలేసినట్టుగానే కోదండ రామ్‌నూ పక్కన పెట్టేశాడు.
తెలంగాణ జన సమితి పార్టీ ద్వారా మెల్లగా తన రాజకీయాలను బలోపేతం చేయాలనుకున్న కోదండరామ్.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారనేది ఆయన బలంగా నమ్మారు. దీనికి తోడు.. తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చింది కాబట్టి ఆ పార్టీని కూడా అధికారంలోకి తీసుకురావాలని బలంగా నిశ్చయించుకున్నాడు. కానీ అంతే బలంగా తన రాజకీయ వ్యూహాలను రచించలేకపోయారు. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా పరాకాయ ప్రవేశం చేయలేకపోయారు. సున్నిత మనస్తత్వం, ఏదీ గట్టిగా నిలదీసి అడగలేని సందర్భాలు ఆయన్ను ఆయా పరిస్థితులు అసమర్థుడిగా నిలిపాయి. దీంతో తనను నమ్ముకున్న వాళ్లకు కూడా అండగా నిలబడలేకపోయారు. అధికార పార్టీతో మిత్రబంధం ఉన్నా.. తన ఉనికి ఇప్పుడు అక్కడ పెద్దగా పనిచేయడం లేదు.
అంతకు ముందున్న విలువ ఇప్పుడు లేదు. అసలు ఎమ్మెల్సీ పదవే తీసుకోకుండా ఉండగలిగితే ఆయనకు మునుపటి గుర్తింపు కొంత ఉండేదనే భావనా ఉంది. జయశంకర్ సార్ అన్నట్టుగా రాజకీయాలు నడపడం అంత ఈజీ కాదు.. తెలంగాణను కొట్లాడి తెచ్చుకోవాలంటే.. ఓ మొండోడు.. ఓ మూర్ఖుడూ కావాలె. ఇప్పటి రాజకీయాలకు కేసీఆర్ కరెక్టుగా సరిపోతాడు..! కోదండరామ్ ఈ రాజకీయాలకు సరిపోరని చాలా సందర్భాల్లో తేలింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం కూడా ఇదే సూచించింది. అటూ ఇటూగా కాకుండా ఏదైనా నిక్కచ్చిగా, నిలదీసే మనస్తత్వం ఉన్నప్పుడే.. తన అస్థిత్వానికి, తనను నమ్మకుని వచ్చిన వారికీ శ్రీరామ రక్షగా నిలుస్తుందనేది మరోసారి తేటతెల్లమైంది కోదండరామ్ విషయంలో.