(దండుగుల శ్రీనివాస్)
అందరూ ఉన్నారు. ఎవరికి వారే భిన్నం. ఎవరి స్టైల్ వారిదే. ఒకరిని మించి మరొకరు. ఎవరి టాలెంట్‌నూ తక్కువ చేసి చూడలేం. శ్రమను నమ్ముకుని వచ్చిన వాళ్లే. అందుకే ఇప్పటిదాకా నిలబడ్డారు. అందులో డౌట్ లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాత్రం ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే విషయం ఉన్నోడు కాబట్టి. అందరిలో లేని క్వాలిటీస్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి. వార్2 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మళ్లీ వైరల్ అయ్యింది ఎన్టీఆర్ స్పీచ్. అభిమానులను కసురుకున్నాడు. మళ్లీ వారికి పాదాభివందనం చేశాడు. వారి బాగు కోరుకున్నాడు. అందుకే కోపగించుకున్నాడు.
అభిమానం వెర్రి తలలు వెయ్యడం అతనికి ముందు నుంచే ఇష్టం లేదు. అందుకే ఎవరేమనుకున్నా.. భ్రుకుటి ముడిపడుతుంది. కళ్లు కోపంతో ఎరుపెక్కుతాయి. మాటలు కసురుతాయి. ఆదేశించి కంట్రోల్‌లో పెడతాయి. దీన్ని కొంతమంది అహంకారమని కూడా అనుకుంటారు. కానీ అంతలోనే అతడి మాటల పరమార్థం తెలిసీ అయ్యో తప్పుగా అనుకున్నామే అనే పశ్చాత్తాపమూ కనిపిస్తుంది. ఇది సర్వసాధారణం. నన్ను, నా డ్యాన్స్‌ను మీరు గ్రేట్ అనుకుంటారు. నేను ఇతరుల నుంచి చాలా నేర్చుకుంటాను.. వాళ్ల డ్యాన్సు నాకు అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది.. కానీ నేను మారను. మీరూ మారొద్దు.. అని నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటాడు.
పార్టీలకతీతంగా సీఎం సహా, పోలీసులకూ పాదాభివందనం అంటాడు. అంతా సహకరించనందుకు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెల్సినోడు.. ఇది చాలా పాతగైంది డైలాగు. ఒక ఇంట్రావర్టు, ఒక ఎక్స్‌ట్రావర్టు… కలిస్తే ఓ జూనియర్ ఎన్టీఆర్ అనాలేమో. అంతే. తన లోకం తనది. తనకు కావాల్సింది చేస్తూ పోతుంటాడు. అందులో మమేకమవుతూ ఉంటాడు. అవసరం లేనప్పుడు మౌనమునే అవుతాడు. అవసరమున్న చోట కంచు కంఠం వినిపిస్తాడు. అది కొందరికీ సాధ్యం. అందులో ఒకడు ఎన్టీఆర్.
Dandugula Srinivas
Senior jOURNALIST
8096677451