(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ పాలనలో అట్టర్ ఫ్లాప్ స్కీమ్ ఏదైనా ఉందంటే అది డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకమే. రెండో టర్మ్ గెలిచిన తరువాత డుబల్ బెడ్ రూం ఇండ్ల బద్నాం నుంచి తప్పించుకునేందుకు స్కీమ్ రూపం మార్చాడు కేసీఆర్. డబుల్ బెడ్ రూం కట్టలేం గనుక సింగల్ బెడ్ రూం ఇళ్లైనా కట్టిస్తాం. కానీ మీకు సొంత జాగా ఉండి ఉండాలె అని కండిషన్ పెట్టిండు. రూ. 5 లక్షల ఇస్తామన్నాడు. ఎన్నికల హామీలో ఇది ఉంది. దీన్నికూడా అమలు చేయలేకపోయాడు కేసీఆర్. ఆ తరువాత అసెంబ్లీ సాక్షిగా మాట మార్చాడు. మేమెప్పుడన్నాం ఐదు లక్షలిస్తామని, మూడు లక్షలే ఇస్తాం అని కూడా చెప్పించాడు అప్పటి మంత్రి ప్రశాంత్‌రెడ్డితో. దీంతో ఇది స్టేట్ మొత్తంగా మళ్లీ అట్టర్ ఫ్లాప్ స్కీమ్‌గా మిగిలిపోయింది.
ఏ ప్రభుత్వంలో కూడా ఇంతగా ఎవరూ విఫలం కాలేదు హౌసింగ్ స్కీమ్ పథకంలో. కానీ ఎవరూ గమనించని, బయటకు ఫోకస్‌లోకి రాని విషయం ఏంటంటే… ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రం ఈ స్కీమ్‌ను పక్కాగా అమలు చేయించుకోగలిగాడు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి. అది ఎలా సాధ్యమయ్యింది? కేవలం పోచారం చొరవతేనే అది సాధ్యమయ్యింది. దాదాపు 20వేల నుంచి 30 వేల ఇండ్ల వరకు పేదలకు కట్టించి ఇచ్చిన ఘనత ఆయనకు దక్కుతుంది. అందుకే ఇప్పటికీ అక్కడ పేదలు పోచారం శ్రీనివాస్‌రెడ్డిని దేవుడిలా చూస్తున్నారు. ఇంట్లో కూర్చున్నా గెలిపించుకునేంత మంచి పేరు ఆయనకు రావడానికి ఇదే ఓ ప్రధానమైన కారణంగా కూడా చెబుతారు.
ఎవరికీ సాధ్యం కాని పనిని పోచారం ఎలా చేశాడంటే.. ప్రతీ చోట గ్రామ కమిటీలు ఏర్పాటు చేశాడు. అందులో ఐదారుగురు ఊరి పెద్దమనుషులుంటారు. అందులో ఒకరుగా కచ్చితంగా హౌసింగ్ ఏఈని మెంబర్‌గా ఉంచుతారు. వీళ్లు చేసే పని.. లబ్దిదారునికి ఇసుక ఉద్దెర ఇప్పిస్తారు.ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు భరించాలి. సలాకా (స్టీల్) ఉద్దెరే. ఇటుక ఉద్దెరే. వీటి ఆమౌంట్‌ను బిల్లు రాగానే చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. వీటన్నింటికీ పోచారం జమానత్. పెద్దాయన ముందుండి ఇవన్నీ చేయించడంతో అంతా ఒప్పుకున్నారు. అనుకున్నట్టుగానే పెట్టుబడి పెద్దగా లేకపోవడం, లేబర్,మేస్త్రీ చార్జీలు మాత్రమే భరించడంతో పెద్దగా పెట్టుబడి అసవరం రాలేదు. బిల్లు రాగానే కమిటీ మెంబర్లు దగ్గరుండి మరీ బకాయిలు చెల్లించేలా చేశారు. అలా సక్సెస్ ఫుల్‌గా వంద గజాల స్థలంలో సింగిల్ బెడ్ రూం ఇండ్లు వేలల్లో కట్టించాడు పోచారం.
Dandugula Srinivas
Senior Journalist
8096677451