(దండుగుల శ్రీనివాస్)
డబుల్ బెడ్ రూం ఇండ్లు గత సర్కార్ కొంపముంచాయి. తడబాటు, తత్తరపాటు, అవగాహన లేమీ.. అన్నీ కలిసి హౌసింగ్ స్కీమ్‌తో కేసీఆర్ సర్కార్ భారీగా బద్నామయ్యింది. పేద ప్రజల శాపనార్ధాలు వినాల్సి వచ్చింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఈ విషయంలో బాగానే శ్రద్ద తీసుకున్నది. సొంతిటి స్థలం ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అదీ 60 గజాలకే పరిమితం చేసింది. నాలుగు విడతలుగా బిల్లుల మంజూరు చేసేందుకు సిద్దమయ్యింది. ఇసుకను ఫ్రీగా సప్లై చేస్తున్నది. అంతా బాగానే ఉంది. కానీ పెట్టుబడి సాయం అందక దాదాపు మంజూరైన వారిలో సగం మంది ముగ్గు దశలోనే ఆగిపోయారు. కారణం తెలిసిందే.
ఇసుక ఫ్రీనే కానీ ట్రాన్స్‌పోర్టేషన్ చార్జిల కింద రూ. 10వేల నుంచి రూ. 15వేల దాకా వసూలు చేస్తున్నారు. సలాకా (స్టీల్) ధర పెరిగింది. సిమెంట్ ధర సరేసరి. ఇటుక కూడా కాస్త ధర పెంచేశారు. ఇక మేస్త్రీ పల్లెల్లో సైతం వెయ్యి రూపాయల కూలీకి తక్కువ రావడం లేదు. లేబర్ చార్జీలు అదనం. అంటే ఓ సొంతిల్లు కట్టుకోవాలంటే .. సర్కార్ సూచించిన ఇందిరమ్మ ఇల్లు లాంటిదే అయినా.. దాదాపు రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల దాకా ఖర్చవుతుంది. దీనికి సర్కార్ ఇస్తున్న మొత్తం రూ. 5 లక్షలు. అంటే.. రూ. 3 లక్షల వరకు అప్పు చేయాల్సిందే. సరే, ఇదంతా ఒక ప్రాసెస్. కానీ తొలత పెట్టుబడి పెట్టేందుకే లక్షన్నర వరకు అవుతుంది. బేస్‌మెంట్ లెవల్ దాకా లేపాలంటే ఈ మొత్తం అప్పు తేవాలి. కట్టాలి. కానీ అప్పు పుట్టడం లేదు. చేతిలో పెట్టుబడి లేదు. సర్కార్ మాత్రం కట్టిన తరువాతే మొదటి బిల్లు చెల్లిస్తుంది. మరెలా? అందుకే మంజూరైన ఇండ్లలో సగం దాకా ముగ్గు దశలోనే ఆగిపోయాయి. ధరల విషయంలో సప్లయర్స్‌తో మాట్లాడతామని సర్కార్ చెప్పింది. అది సాధ్యం కాలేదు. కాదు.
డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలిప్పిస్తామన్నది. అదీ చేయడం లేదు. పోనీ ముందే ఒక బిల్లును అడ్వాన్స్ ఇప్పిస్తే.. దీంట్లో అవకతవకలు జరుగుతాయనే భయం ఉండనే ఉంది. మరెలా..? ఇప్పుడు సర్కార్ ఆలోచించాల్సింది ఇదే. ఇందిరమ్మ ఇళ్లను స్టార్టింగ్ ట్రబుల్స్ లేకుండా చేస్తేనే ముందుకు సాగేది. పేదవాడి సొంతిటి కల నెరవేరేది. లేదంటే కేసీఆర్ పాలనలో మాదిరిగానే ఈ హౌసింగ్ స్కీమ్ కూడా ఫెయిల్యూర్ స్కీమే అయి కూర్చుంటుంది.
Dandugula Srinivas
Senior Journalist
8096677451