(దండుగుల శ్రీనివాస్)
వాస్తవం కథనంతో ఎట్టకేలకు సర్కార్ కోదండం అండ్ టీమ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి తెలంగాణ జన సమితి సపోర్టు తీసుకున్న రేవంత్.. సీఎం అయిన తరువాత మాత్రం వారి వైపు కన్నెత్తి చూడలేదు. దీనిపై వాస్తవంలో పలు కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన బుధవారం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కోదండంరాం అండ్ టీం అంతా కలిసి సీఎంతో ముచ్చటించారు.
మంచీ చెడ్డా మాట్లాడుకున్నారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకిచ్చిన మాటను యాది చేశారు. ఎటుకాకుండా అయిపోయామనే ఆవేదన వెలిబుచ్చుకున్నారు. చివరగా ఏదో వినతిపత్రం ఇచ్చారు. చేస్తాం.. న్యాయం తప్పకుండా చేస్తం.. అన్నారే తప్ప.. పదవుల ఊసు లేదు. ఇప్పుడు కలిశారు.. మళ్లెప్పుడు టైమిస్తారో తెలియదు. అప్పటి వరకు వేచి చూస్తారు. అంతకు మించి వారు చేసేదేమీ కూడా లేదక్కడ.
కోదండం కు ఎమ్మెల్సీ వచ్చింది చాలు. ఆయన మాత్రం హాయిగా తిరుగుతున్నాడు. మా గురించి పట్టించుకోవడం లేదు అని తన టీమ్ నుంచే ఆరోపణలు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఆ పోరు భరించలేక ఇలా సీఎంతో కాసేపు మాట్లాడించి చల్లబరిచి పంపించేశాడు ప్రొఫెసర్ సాబ్..!