(దండుగుల శ్రీనివాస్)
నాతో వచ్చేదెవరు..!? నాతో చచ్చేదెవరు..!? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు..!? జై మాహిష్మతీ…! ఈ ఫేమస్ డైలాగు ఏ సినిమాలోనిదో చెప్పనవసరం లేదనుకుంటా. ఇప్పుడు బీసీ కార్డందుకుని మీకు నేను అండగా ఉంటా.. కొట్లాడుతా అంటే ఎంత మంది నమ్ముతారు. రిజర్వేషన్ల చురుకు తలగాలంటే రైల్ రోక్ చేస్తారట. వచ్చనెలలో. ఇదేమన్నా తెలంగాణ ఉద్యమ కాలమనుకుంటే పొరపాటే అక్క. ఇప్పుడు నిన్ను నమ్మెదే తక్కువ.
అప్పుడు లేని బీసీ ఇప్పుడెట్లొచ్చె. నాయన్నకు బీసీలంటేనే పడదు. నువ్వేమో మాటకు ముందో సారి జై కేసీఆర్.. చివరో జై కేసీఆర్… ఆయనను కాదని బయటకు వచ్చేంత సీన్ లేదు. లోపలున్నా.. బయటకు వచ్చినా నమ్మి పోలోమని వచ్చే టీమ్ లేదు. ఇప్పుడు రైల్ రోకోకు వచ్చేదెవరు..? వాళ్లు పెట్టే కేసులు ఎదుర్కొని ధైర్యంగా నిలబడే దమ్మున్నోళ్లెవరు..? అందులోనూ నిన్ను నమ్మి. ముందైతే ఆ జాగృతి కమిటీలు వేసేసి బీసీలందరికీ పదవులు పంచేయరాదు. కనీసం వాళ్లన్నా నీ పేరు చెప్పుకుని బతుకుతరు.