(దండుగుల శ్రీనివాస్)
పాలనపై పట్టు సాధించే క్రమంలో మొన్నటి వరకు వేచిచూసిన సీఎం రేవంత్.. ఇక తనదైన పంథాను అనుసరిస్తున్నాడు. మొన్నటి వరకు ఇల్లు చక్కబెట్టుకోవడానికే సమయం పట్టింది. పార్టీలో సీఎంగా ఇమడానికి, అందరినీ మచ్చిక చేసుకోవడానికి, తన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి సమయం తీసుకున్నాడు. ఇప్పుడిప్పుడే పాలనపై పట్టు బిగిస్తున్నాడు. తన మార్కును వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. మూడు కేబినెట్ బెర్త్‌లు ఖాళీగానే ఉంచి, ఆ కీలక శాఖలను తన వద్దే ఉంచుకుని, ఇప్పుడున్న కేబినెట్ టీమ్‌తోనే పాలన పర్ఫెక్ట్‌గా చేసేందుకు నడుం బిగించాడు.
ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కస్సుమనడం కూడా అందులో భాగమే. సీఎం ఆదేశాలు లేకుండా, ఆయన సూచన లేకుండా మహేశ్ ఒక మంత్రిని తుక్కు తుక్కు తిట్టినంత పని చేయడు. పార్టీలో కీలక నేతగా ఉన్న పొంగులేటిపై విరుచుకుపడటం అంటే ఆషామాషీ కాదు. కానీ తప్పదు. ఒక్కసారి ఇలాంటివి చేస్తేనే మిగితా వారంతా సెట్ రైట్ అవుతారని సీఎం భావిస్తున్నాడు. రోజుకొకకరు ఇష్టారీతిన మాట్లాడుతూ, వ్యవహరిస్తూ పోతే పార్టీ ప్రతిష్ట, ప్రభుత్వం పరువు పోతుందని తెలుసు.
ఇప్పటి వరకు ఓపిక పట్టారు. ఇక నో చాన్స్. వినలేదనుకో. మరో కేబినెట్ విస్తరణ అస్త్రం ఉండనే ఉంది. సమయం చూసి బాణం వేసి మార్పులు, చేర్పులు, ఇన్, ఔట్ చేసేసి మరిన్ని సంస్కరణల పర్వం చేపట్టేందుకు కూడా వెనుకాడబోననే సంకేతాలు సీఎం నుంచి ఇక వస్తాయి. ఇదే వారిని దారిలోపెట్టే ఏకైక మార్గం. కానీ ఇవన్నీ తను చేయడు. తను చెప్పుడు. మహేశ్‌తోనే అంతా చేయిస్తాడు. మహేశ్ చేస్తూ పోతాడు. వార్నింగులిస్తాడు. కాంగ్రెస్‌లో ఇవన్నీ కామనే. చూద్దాం ఎంత వరకు సీఎం వీరిని గాడిలో పెడతాడో.