(దండుగుల శ్రీనివాస్)
మరో మంత్రివర్గ విస్తరణపై ఆశలు వదులుకున్నారు. అది ఉండే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. మూడు బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. అవి భర్తీ చేస్తామని చెబుతున్నారు. కానీ ఇప్పట్లో అది జరగదు. మరి ఎప్పట్లోగా జరుగుతుంది…? ఆ ఒక్కటి అడక్కు..! అంతే. కీలకమైన మూడు పొర్ట్ఫోలియోలు సీఎం రేవంత్రెడ్డి చేతుల్లోనే ఉన్నాయి. హోం శాఖతో పాటు విద్యా, మున్సిపల్ శాఖలు తన వద్దే ఉంచుకున్నాడు సీఎం. తాలు, మామూలు శాఖలన్నీ మొన్న కొత్త మంత్రులకు కేటాయించేశాడు. తన వద్ద ఉన్న ఈ మూడు శాఖలపై పట్టు కోసం సీఎం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సీఎం సన్నిహితుడు వేం నరేందర్రెడ్డి ఓ రకంగా ఈ హోం శాఖను అనధికారికంగా చూసుకుంటున్నట్టున్నారు. సీఎంకు కూడా దీనిపై పట్టు కుదురుతున్నది. ఇక విద్యా శాఖ సీఎం వద్ద ఉండటంపై చాలా విమర్శలొస్తున్నాయి. ఆయన బిజీ బిజీగా ఉండి దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఆయనతో ఈ శాఖ మెయింటేన్ చేయడం కాదనే విమర్శలు బాహాటంగానే ఉన్నాయి. కానీ ఆ శాఖను ఎవరికీ కేటాయించలేదు సీఎం. విద్యాశాఖ విషయంలో గత సర్కార్ ఫెయిలయ్యింది. పలు ఆరోపణలు ఎదుర్కొన్నది. సరిగ్గా నిర్వహించలేకపోయింది. కేసీఆర్ సర్కార్ ఓటమిలో అది కూడా ఓ ప్రధాన భూమిక పోషించింది. అందుకే రేవంత్ దీన్ని ఎవరికీ కేటాయించలేదు. తన వద్దే ఉంచుకున్నాడు. దీనిపై తొలిసారిగా శుక్రవారం సమీక్ష నిర్వహించాడు. అధికారులకు పలు కీలక సూచనలు చేశాడు.