(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ చేసిన మంచి పనుల్లో, గుర్తుంచుకోవాల్సిన గురుతుల్లో ధర్నాచౌక్ ఎత్తేయడం ఒకటి. దాని పేరే లేకుండా చేయడంలో మొండిగా పోయి సక్సెసయ్యాడు కేసీఆర్. ఈ ధర్నాచౌక్ ఇప్పుడు ఆయనే అవసరం పడ్డది. ఆయన కోసం ఆందోళన చేసేందుకు అదే చోటు దిక్కయ్యింది. ఊహించలేదు కావొచ్చు. బహుశా ఎప్పటికీ అంటే చచ్చేదాకా నేనే తెలంగాణకు సీఎం అని ఫిక్సయి ఉంటాడు. నేను కాకపోతే నా కొడుకు సీఎంగా ఉంటాడు.. తప్పితే అధికారం మా చేతిలో నుంచి పోయే ముచ్చటే లేదని ఫిక్సయి పోయి ఉంటాడు. అందుకే ఆయనకు ఆ ధర్నా చౌక్ అంటే చిర్రెత్తుకొచ్చింది.
ఎహె.. ఈ నట్టనడిమిట్ల గీ ధర్నాలు గిర్నాలు ఏంది బై … ఎటన్నా దూరం పోయి చేస్కొర్రి అని ఎవరెంత మొత్తుయాకున్నా వినలే. ఎత్తిపడేశాడు. ఆ పేరే వినపడకుండా చేయాలనుకున్నాడు. సాధించాడు. కానీ వాళ్లకే ఆ జాగా అవసరం పడుతుందని .. అదీ ఇంత తొందరగా అక్కడ కూర్చుని న్యాయం కావాలె… ఖండిస్తున్నాం.. ఇదన్యాయం అని అరవాల్సి వస్తుందని అస్సల్ ఊహించలేదు. ఇప్పుడు అక్క అకడ్నే ఆందోళనకు సిద్దమైంది. అదీ తండ్రి కోసం. తండ్రికి.. అదే తెలంగాణ జాతి పితకు … నోటీసులివ్వడమా.. సిగ్గు సిగ్గు.. ఇది ఆయనకు నోటీసిచ్చినట్టు కాదు.. యావత్ తెలంగాణకు ఇచ్చినట్టేనని తేల్చేసి తెగేసి తేల్చుకునేందుకు ఇవాళ ధర్నాచౌక్ దగ్గర.. కాదు కాదు ఇందిరాపార్క్ దగ్గర… ధర్నాకు దిగుతున్నది.
అదేందీ.. ఇందిరాపార్క్ దగ్గర అంటే ధర్నాచౌకే కదా. కానీ వాళ్లు ఆ పదాన్ని ఉచ్చరించేందుకు అనర్హులు. వారిని ధర్నాచౌక్ వేలేసింది. ఆపేరు ఉచ్చరించే అర్హత మీకు లేదని శాపం పెట్టింది. అందుకే ఓ అన్న.. అదే కేటీఆర్.. ఓ అక్క అదే కవితక్క… అక్కడ ధర్నాలు చేస్తున్నారు. కానీ దాని పేరు ధర్నాచౌక్ అని ఉచ్చరించడం లేదు. ఇందిరాపార్క్ అని పేరు పెట్టుకున్నారు. తండ్రి చేసిన పాపం.. ఇలా శాపంలా మారిందా… లేదంటే తండ్రి చేసిన పని సబబే కాబట్టి.. మనం ధర్నాచౌక్ అని ఎందుకు పిలవాలనే పొగరుతో కూడిన అహంతో అలవాటుగా వచ్చిన దోరణా…? ఏమో ఏదైనా కావొచ్చు. సరే గానీ….అక్కా..! లేఖలో గీ ధర్నాచౌక్ ముచ్చట కూడా తీసేదుండే..! డ్యాడీ .. ధర్నాచౌక్ ఎందుకెత్తేశావ్..! అని. ఇంకా చాలా లేఖలు రాయాల్సి ఉంటుంది అక్కో… మున్ముందు. ఇప్పుడైతే గీ ధర్నా చెయ్…! ఖండించాలి.. ఖండించాలి… కేసీఆర్‌కు నోటీసులివ్వడాన్ని యావత్ తెలంగాణ ఖండించాలి…!