(దండుగుల శ్రీనివాస్)
కవిత నుంచి లేటు స్పందన వచ్చింది. ఆంధ్రజ్యోతిలో ఇష్టారీతిన వచ్చిన కథనాలపై ఆమె మెల్లగా తన స్పందన తెలియజేసింది. తనను సంప్రదించకుండా ఇలా రాయడమేంటని ఆర్కేను ప్రశ్నించింది. ఇది జర్నలిజమా..? శాడిజమా..? అని నిలదీసింది. వాస్తవం డిజిటల్ మీడియాలో దీనిపై ముందే ఓ కథనం వచ్చింది. ఆర్కే .. కవిత భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్‌కు సూటి పెడుతున్నాడని. అందుకే వాస్తవ దూర కథనాలు వండి వారుస్తున్నాడని కూడా రాసింది. ఎట్టకేలకు కవిత మౌనం వీడింది. ఇదేం రాతలని మండిపడింది. వాస్తవవానికి మీడియాకు ఆ వార్తలు రాసే స్వేచ్ఛ ఉంది. అన్నీ అడిగి, వివరణ తీసుకుని, ప్రతీ స్టోరీ వివరణతో కూడి రాయాలనే నిబంధన లేదు.
అది ఎప్పటి ముచ్చటో. ఇప్పుడు ఆ జర్నలిజం నిబంధనలు, విలువలు పాటించడం లేదు. సోషల్ మీడియా వచ్చిన తరువాతైతే ఇది మరీ ఎక్కువైంది. ఓ మీడియా హౌజ్ నడిపించిన అనుభవం ఉన్న కవితకు ఇది తెలియంది కాదు. కానీ మీడియాతో ఆమె అంతరం పెంచుకోదలుచుకోలేదనుకుంటా.అందుకే సుతిమెత్తగానే ఆర్కేను పేరు తీయకుండా మందలించింది. గతంలో ఆంధ్రజ్యోతి పేపర్‌ను ప్రెస్మీట్లో చూపుతూ మరీ ఇలాంటి వారితో తెలంగాణ జనం జాగ్రత్తగా ఉండాలని కూడా కామెంట్ చేసింది గతంలో.
కానీ ఈసారి మాత్రం ఆచితూచి మందలించినట్టు సరిపెట్టింది. ఇప్పుడు తండ్రితో కూడా వేరుపడనున్న నేపథ్యం కావొచ్చు.. కొత్త దారి వెతుక్కునే భవిష్యత్తు పరిణామాల ముందు చూపు కావొచ్చు.. మీడియాతో మాత్రం ఆమె అంతరం పెంచుకోవద్దని భావించినట్టు ఆమె ఆచితూచి స్పందన తెలియజేస్తోంది. అదీ చాలా లేటుగా స్పందించడం చూస్తుంటే.. ఆమె శ్రేయోభిలాషుల ఒత్తిడి మేరకు ఆ మాత్రం స్పందన ప్రకటన రిలీజ్ అయి ఉంటుంది.