Dandugula Srinivas
కలెక్టర్లకు క్లాస్ తీసుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. తను ఎంత మొత్తుకున్నా కలెక్టర్ల తీరులో మార్పు రావడం లేదు. ఏసీ గదులకు పరిమితమవుతున్నారని వేదికలనెక్కి తిట్టినా వారిలో ఇంచు మందం మార్పు రాలేదనే విషయాన్ని మరోసారి ఆయన పరోక్షంగా గుర్తు చేశాడు. ముందస్తుగా కురుస్తున్న వర్షాలు రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సరిగ్గా లేదని, సమయానికి చేయలేదని, వర్షానికి ధాన్యం తడిచి రైతు నష్టపోయాడని ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో .. సీఎం ఈ విషయంలో కలెక్టర్లను టార్గెట్ చేశాడు.
ఎందుకు సరైన వివరణ ఇవ్వలేపోతున్నారని మండిపడ్డాడు. అనారోగ్యంతో రైతు చనిపోయినా ధాన్యం కొనుగోళ్లకు లింకు పెడుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు..? వివరణ ఎందుకు ఇవ్వడం లేదు..? 90 శాతం ధాన్యం కొనుగోళ్లు జరిగినా ఆ వివరాలు ఎందుకు విడుదల చేయడం లేదు..? అని కలెక్టర్ల తీరును ఎండగట్టాడు సీఎం. మంచి పనిని చెప్పడంలో వెనుకబడ్డామని ఒప్పుకున్నాడు. ప్రతిపక్షాల దుష్ప్రచారంలో కొట్టుకుపోతున్నాం తప్పితే దాన్ని ధీటుగా ఎదుర్కొని బదులివ్వడంలో విఫలమయ్యామని మండిపడ్డాడు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కలెక్టర్లదే పూర్తి బాధ్యతన్నాడు.
ఇసుక నుంచి మొదలుకొని మేస్త్రీలు, కంకర ధరల విషయంలో కూడా చొరవ తీసుకోవాలని ఆదేశించాడు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇక కదలండని వారిని పురమాయించాడు. ఓ వైపు వర్షాల తీరును ఎదుర్కుంటూనే, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూనే, విత్తనాలు, ఎరువుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకుంటూనే.. ఇందిరమ్మ ఇళ్ల పూర్తికి వంద శాతం ఎఫర్ట్ పెట్టాలని టార్గెట్లు విధించాడు.