(దండుగుల శ్రీనివాస్)
కవిత రాజకీయ వ్యూహం మొదలైంది. ఆమె కేటీఆర్‌కు ఫార్మూలా ఈకార్ రేస్ అవినీతి విషయంలో ఇచ్చిన నోటీసులపై సత్వరం స్పందించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరతీసింది. కవిత కేసీఆర్‌కు లేఖ రాయడం, ఆ తరువాత ఆ లేఖ తనే రాశానని క్లారిటీ ఇవ్వడంతో పాటు .. కేసీఆర్ దేవుడే కానీ, చుట్టూ దయ్యాలున్నాయని కామెంట్ చేయడం తీవ్ర చర్చ మొదలైంది. దీంతో ఆ దయ్యాల్లో ప్రధాన దయ్యం కేటీయారే అనుకున్నారంతా.
ఎందుకంటే పార్టీ పగ్గాలు కేటీఆర్‌కే దక్కాయి. ఇక కాబోయే సీఎం కూడా కేటీయారేననే ప్రచారం ముందు నుంచీ ఉంది. దీంతో తన ఉనికి ప్రశ్నార్థకమనే రీతిలో కవిత .. అన్నను టార్గెట్ చేసిందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సర్కార్ ఏసీబీ ద్వారా కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసులతో ఆమె వెంటనే స్పందించడంతో అంతా అవాక్కయ్యారు. అయితే దయ్యం కేటీఆర్ కాదన్నమాట, సంతోష్ రావేనని ధ్రువీకరించుకుంటున్నారు.
కవిత రాసిన లేఖ సంతోష్‌రావే లీక్ చేశాడని అనుకుంటున్నారు. అయితే సంతోష్‌రావు .. కేసీఆర్ మాట జవదాటడు. ఒకవేళ సంతోష్‌రావే లేఖ లీక్ చేస్తే అది కేసీఆర్ చెబితేనే జరుగుతుంది తప్ప ఆయనకు అంత సీన్ లేదని కూడా ఆ పార్టీ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి.