(దండుగుల శ్రీనివాస్)
గోపిచంద్ రణం సినిమాలో ఓ కామెడీ సీన్ ఉంది. అలీతో ధర్మవరం చెప్పే డైలాగ్ అది. మీరిద్దరూ ఒకర్నొకరు ప్రేమించుకుని అదృష్టవంతులా..? మధ్యలో నేను బేకార్‌గాణ్ణా…!? అని. అట్లనే ఉంది సేమ్ కేటీఆర్ ప్రెస్‌మీట్ ఇవాళ. ఓ వైపు చెల్లె దేవుడు, దయ్యం… కుట్ర, కుతంత్రం.. అని పార్టీని బజారులోకి గుంజితే వార్త కాదా..? అదే అడిగాడు విలేకరులు కేటీఆర్‌ను. ఆగుండ్రి బై ఎందుకంత ఆగమైతుండ్రు. ఇంత మంచి వార్త చెబితే రాయరు గానీ, మీకు కావాల్సింది రాస్తరు. మీ హెడ్డింగులు ఏందో నాకు తెలుసు. రేవంత్ మీ మీద తెచ్చే ఒత్తిడీ తెలుసన్నాడు. అవాక్కయ్యారు పాపం జర్నలిస్టులు మిత్రులు.
అంతకు ముందు కేటీఆర్ మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో యంగ్ ఇండియా ఖాతాకు రేవంత్ బలవంతంగా చందాలు వేయించాడనే ఆరోపణతో రాహుల్, సోనియా పేర్లతో పాటు రేవంత్ పేరును కూడా చేర్చిందని, వెంటనే రాజీనామా చేయాలని చెప్పాడు. అయితే ఆ వార్త ఏ మీడియా కూడా రాయలేదని ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు చెల్లె కవిత గురించి అడిగే సరికి కస్సుమన్నాడు జర్నలిస్టుల మీద. పార్టీలో ఇదే కామనే అని సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేసినా.. చెల్లె చేసింది తప్పేనని ఒప్పుకోవాల్సి వచ్చింది గత్యంతరం లేక.
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డ చందంగా అన్నాచెళ్లెళ్లు, తండ్రీ బిడ్డలు, తండ్రీకొడుకుల మధ్య ఉన్న విభేదాలతో వాళ్లు రచ్చకెక్కి మీడియా దీన్ని పెద్దగా చేస్తుంది.. రాస్తుంది అని నోరు పారేసుకోవడమేందో..? మీరు రాయకపోతే రాయకండి.. సోషల్ మీడియా ఉంది కదా అన్నాడు మళ్లీ. అంటే మెయిన్ మీడియాను నమ్మడం లేదన్నమాట. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీడియా ఇలాగే ఉంది కేటీఆర్ సాబ్.. అప్పుడు నచ్చిన మీడియా.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోగానే చేదైంది. చేతిలో వందల సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయనే ధైర్యం కావొచ్చు.. పాపం వర్కింగ్ జర్నలిస్టులను , మెయిన్ మీడియాను కల్లులో ఈగ లెక్క తీసిపాడేశాడు.
ఈడీ వన్నీ రాజకీయ కోణంలో పెట్టే కేసులేనని తనే చెబుతాడు. మళ్లీ రేవంత్ పేరు ఎక్కింది.. దోషి అని గగ్గోలు పెడతాడు. చెల్లె కవితతో పడటం లేదు కానీ, పనిలో పని మొన్నటి ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ కేసు కూడా రాజకీయ కుట్రలో భాగమే అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు చెల్లె వేరు పార్టీ కదా.. అందుకే ఆమె పేరు, ఆమె ఊసు తీయలేదు. ఇక్కడ కేటీఆర్ చెప్పిన విషయంలో క్లారిటీ మిస్ అయ్యింది. ఈడీ రేవంత్ రేవంత్‌పై కేసు పెట్టింది. అది నిజమే అని నమ్ముమంటాడా..? లేక రాజకీయ కుట్రలో భాగమేనంటాడా..?
బలవంతపు చందాల విషయానికొద్దాం.. టీఆరెస్, బీఆరెస్ చందాలు వసూలు చేయనిదే 1500 కోట్ల వరకు పార్టీ ఖాతాల్లో ఉన్నాయా..? సరే, ఎన్నో ఉన్నాయి. అవన్నీ రాజకీయాలే. ఇవన్నీ నాయకులకు మామూలే. మధ్యలో మేమన్నాం అన్నాం అంత మాటనేశావ్ అని మీడియా నోరెళ్లబెట్టింది. కేటీఆర్‌పై కస్సుమన్నది. గుర్రుమన్నది. గుడ్లురిమి చూసింది. కేటీఆర్ మాత్రం ఇంచుక మందం కూడా జంకలే. పో పోవోయ్.. మీరు లేకపోతే నాకు నా సోషల్ మీడియా లేదా..? అని డోన్ట్‌కేర్ అన్నట్టుగా లేచి దండాలు పెట్టి జారుకున్నాడు.