(దండుగుల శ్రీనివాస్)
సాక్షి ఆఫీసు ముందు నుంచి సిటీబస్సులోంచి ఓ పెద్దాయన పక్కనున్న ఓ యువకుడ్ని అడిగాడు.
ఆ సాక్షి ఆఫీసు ముందు ఎందుకు వాళ్లు ధర్నా చేస్తున్నారు..?
ఆళ్లు జర్నలిస్టులు, ఆ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులే ..! అన్నాడు ఆ యువకుడు. ఆసక్తిగా అక్కడ ధర్నా చేస్తున్న వారిని గమనిస్తూ..
సిటీ సెంటర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడ్డది. సిటీబస్సులన్నీ కిక్కిరిసిపోయి ఆగి ఉన్నాయి. ఆ బస్సు కిటికీల నుంచి వందల సంఖ్యలో కళ్లు సాక్షి ఆఫీసు మెయిన్ గేట్ వద్ద ధర్నా చేస్తున్న జర్నలిస్టులను చూస్తున్నాయి. వాళ్ల చేతుల్లో ఉన్న ఫ్లకార్డులను చదువుతున్నాయి.
సిగ్గు సిగ్గు… నశించాలి.. కక్ష సాధింపు.. అంటూ ఏవేవో రాసి ఉన్నాయి. కానీ ఎందుకు చేస్తున్నారో సరిగ్గా అర్థమయి చావడం లేదు వారికి.
ఏంది బిడ్డా వాళ్లకు జీతాలిస్తలేరా..?
మళ్లీ అడిగాడు ఆ పెద్దాయన…
కాదు.. కాదు.. అన్నాడు యువకుడు. కానీ అర్థం కావడం లేదు అతనికి కూడా. ఎందుకు చేస్తున్నారో..?
మరెందుకు అట్ల ఎండల నిలబడి ఒకటే ఒర్రుతుండ్రు.. జీతం కోసమే అయ్యుంటది..!
తన అనుమానమే కరెక్టు అనే విధంగా మళ్లీ అన్నాడు ముసలాయన.
పక్కనున్న మరో యువకుడు అందుకున్నాడు.
ఏ కాదు కాక.. వాళ్ల ఎడిటర్‌ను ఏపీల అరెస్టు చేసిండ్రంట..!
కొంచెం క్లారిటీతో చెప్పాడు.
ఇంకొకడు తన ఫోన్‌లో ఫేస్‌బుక్కులోంచి ముఖం బయటకు తీసి .. అవును అప్పుడు తప్పుడు వార్తలు రాసిండంట… అందుకే … అన్నడు
ఏం పేరు నాయన…!
ధనుంజయ్‌రెడ్డి..
కానీ ధనంజయ్‌రెడ్డి అని రాసిండ్రు..
ఏ పేరు కరెక్టో నాకైతే తెల్వదు అన్నడు ఆ యువకుడు మళ్లా ఆ ఫోన్‌లో ముఖం పెడుతూ..
గ్రీన్ సిగ్నల్ పడ్డది. బస్సులు కదులుతున్నాయి. భారంగా.
ప్రయాణికులు ముఖం తిప్పేశారు. ఓస్ ఇంతేనా..? అని.
Dandugula Srinivas
8096677451