(దండుగుల శ్రీనివాస్)
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేలా లేదు. కానీ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైందని జరిగిన ప్రచారంతోనే ఒకరిద్దరికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలుకుతారని కూడా వార్తలు జోరందుకున్నాయి. అందులో ప్రధానంగా కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులను మంత్రివర్గంనుంచి తొలగిస్తారని ఊహాగానాలు నడిచాయి. వీరిద్దరినీ తప్పిస్తే ఎవరికి ఇస్తారు..? కుల సమీకరణాలను బట్టి ఎవరికి బెర్త్ ఖరారు కావొచ్చనే అంశాలపై చర్చోపచర్చలు జరిగాయి. జరుగుతున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఎవరికీ ఉద్వాసన ఉండబోదని, పాత వారిని యధావిథిగా అట్లనే కొనసాగిస్తారని తెలుస్తోంది.
దీంతో కొండా సురేఖ, జూపల్లి ఊపిరిపీల్చుకుంటున్నారు. వాస్తవానికి వారిలో కూడా ఓ భయం ఉంది. ఎందుకంటే వీరిద్దరి పట్ల అధిష్టానం గుర్రుగా ఉదంటూ ప్రచారం మాత్రం జోరుగా సాగింది. వీరిద్దరి సామాజికవర్గాలు, సీనియారిటీ కూడా వీరిని కాపాడిందనే చెప్పాలి. దీనికి తోడు వీరిద్దరిపైనా సీఎంకు మంచి అభిప్రాయమే ఉంది. సీఎంను కాదని ఏనాడూ గీత దాటలేదు. సీఎం కనుసన్నల్లోనే కొనసాగారు. కొన్ని తప్పులు జరిగిన రేవంత్ క్షమించేశాడు. ఉద్వాసన విషయంలో అధిష్టానం మనసులో ఏముందో కూడా ఇక్కడి కీలక నేతలకు సమాచారం లేదు. ఎందుకంటే చాలా విషయాలు వీరి నుంచి రాబట్టారే తప్ప, వారి మనసులోని మాటను చెప్పలేదు.
మొత్తానికి మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం కావడంతో పాటు కొత్త ముఖాలు శ్రీహరి మినహా ఎవరెవరు వస్తారో కూడా ఇక్కడి ముఖ్య నేతలకు కరెక్టు సమాచారం లేదు. ఉద్వాసన మాత్రం ఉండబోదు, పాతవారే యథావిధిగా కొనసాగుతరనే సంకేతాలు మాత్రం అందినట్టు తెలుస్తోంది.