Dandugula Srinivas
వాళ్లంతా సదువుకున్న సన్నాసులు. డిగ్రీ పట్టా పుచుకున్న పాగల్‌గాళ్లు. ఓటెయ్యాల్నో ఇంకా తెలుసుకోని బచ్చాగాళ్లు. అంగోఠి నిషానీ గాళ్లకన్నా బేకార్‌గాళ్లు. అవును ఇట్లనే తిట్టుకుంటున్నరంతా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు కుప్పలు తెప్పలుగా పోగయినయంట. వేలకొద్ది. పోలైనవి రెండున్నర లక్షలు. అందులో యాభైవేల దాకా చెల్లనియే అంట. అట్లున్నరు మనోళ్లు. ఎప్పుడు గీ తిట్టు తింటనే ఉన్నరు. కానీ మానరు. మారరు. ఈసారీ ఇట్టనే చేసిర్రు. తెగ తిట్లు తింటున్నారు. థూ మీ బతుకులు… అనే కాడికి వచ్చింది. సరే. అసలు సంగతికొద్దాం. పోలింగ్ శాతం పెరిగింది. మంచిదే.
కానీ చెల్లని ఓట్లు ఎవలి కొంప ముంచుతాయి. నరేంద్రుడిదా…? అంజిరెడ్డిదా..? ఇయ్యాల మొదలైతది లెక్కింపు. ఏ రాత్రికో గానీ తెల్వదు. ఎవలు గెలిచిండ్రో. ఇయ్యాల మొత్తం కట్టలు కట్టుడే అయ్యింది. శివరాత్రి తెల్లారే పోలింగ్ అనే సరికి .. శివుడు ఎవలి కొంపలు ముంచుతాడో అనుకున్నరు. ఎందుకంటే. అదే రోజు ఒక్కపొద్దులు. ఒక్కపొద్దులిడిసి మెల్లంగా ఓ కునుకు తీస్తే.. మరి రాత్రంతా జగనేకీ రాత్ ఆయే. అందుకే మనోళ్లు బయపడ్డరు. కానీ బయపడ్డంత ఏమీ కాలేదు. పదిశాతం పోలింగ్ ఇంక పెరిగింది. ఆ పెరిగిన పోలింగ్ నాకు కల్సొస్తదంటే నాకు కల్సొల్సద్దనుకున్నరు. కానీ చెల్లని ఓట్లు పొల్లు పొల్లు బయటపడే సరికి సల్లబడ్డరు ఇద్దరు. వీరిలో ఈ చెల్లని ఓట్లు ఎవరిని చెల్లని రూపాయి చేస్తయో. చూడాలె మరి.