(దండుగుల శ్రీనివాస్)
ఈ చెబ్బీస్ జనవరి స్పెషల్. ఇవాళే సర్కార్ కీలకమైన పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. నాలుగు స్కీంలు అంటున్నారు గానీ, ఇందులో మూడు పాతవే. ఒకటే కొత్తది. రైతు బంధుకు బదులు రైతు భరోసా పేరు మార్చి రెండు వేలు పెంచి ఇస్తున్నారు. అదీ ఒక ఏడాది ఆలస్యంగా. ఇక ఇందిరమ్మ ఇంటి కోసం ఐదు లక్షల వందశాతం సబ్సిడీ అమౌంట్ ఇస్తారు. విడతల వారీగా. ఇదీ గతంలో బీఆరెస్ సర్కార్ చేద్దామనుకున్నదే. కానీ చేయలేదు. చేతకాలేదు. ఇప్పుడు ఈ సర్కార్ దీన్ని ఎలా చేస్తుంది. లెక్కలకే పరిమితమవుతుందా..? అందరికీ అందరి ద్రాక్షగానే డబుల్ బెడ్ రూం ఇండ్ల స్కీం మిగిలిపోతుందా..? చూడాలి.
ఇక రేషన్‌కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ. ఇది స్కీమే కాదు. కానీ బీఆరెస సర్కార్ దీని జోలికే పోలేదు చాలా ఏండ్లుగా. ఎందకంటే రేషన్‌కార్డులు పెరిగితే మరింత భారమవుతుందనే భయం కేసీఆర్ సర్కార్‌ను వెంటాడింది. అందుకే వాటిని అటకెక్కించారు. ఇప్పుడు వీరు మోక్షం కల్పిస్తున్నారు. అంతే తేడా. ఇక ఒకే ఒక కొత్త పథకం రాష్ట్రంలో ఇవాళ షురూ కాబోతుందని చెప్పాలి. అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. దీని కింద భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాది పన్నెండు వేలు రెండు విడతలుగా వారి ఖాతాల్లో వేసేందుకు నిర్ణయించారు. ఉపాధి కూలీలు, వంద రోజుల పని, జాబ్ కార్డు, ఏమీ భూమి లేకుండా ఉండాలనే సవాలక్ష ఆంక్షలు పెట్టారు దీనికి.
ఎంత మందికి వస్తుందో తెలియదు. పట్టణాల్లో ఉపాధి కూలీలుండరు. అంటే వారు వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు కాదని సర్కార్ ఉద్దేశం. ఇలా మొత్తానికి ఇవాళ ఈ నాలుగు పథకాలను విడుదల చేస్తారు. జిల్లాలోని ఓ మండలంలోని ఒక గ్రామాన్ని ఇవాళ పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని వంద శాతం ఎంపిక చేయబడిన వారికి ఈ పథకాలు వర్తింపచేస్తారు. ఇక మిగిలిన చోట్ల ఫిబ్రవరి 1 నుంచి మార్చి నెలాఖరులోగా అర్హులందరికీ వీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికీ తమ పేరు జాబితాలో లేకపోతే ఫిబ్రవరి ఒకటో తారీఖు దాకా దరఖాస్తులు చేసుకోవచ్చు.