(దండుగుల శ్రీనివాస్)
పేదవాడు సొంతింటి కోసం ఎంతగా తపిస్తున్నాడో ఇది నిదర్శనంగా నిలుస్తోంది. గత ప్రభుత్వం పదేళ్లుగా హౌసింగ్ స్కీంలో ఎంత ఘోరంగా విఫలమైందో ఇది కళ్లకు కడుతోంది. డబుల్ ఇండ్ల పేరుతో ఓట్లు దండుకున్న గత సర్కార్ జనం చెవిలో పువ్వులు పెట్టిన వైనాన్ని ఇది నిరూపిస్తోంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనగానే మళ్లీ ఆశలు ఎలా చిగురించాయో ఈ చాంతడంతా క్యూ అందరికీ తెలియజేస్తోంది. ప్రజా భవన్‌కు ప్రతీ శుక్రవారం జరిగే ప్రజావాణిలో వేలాది మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం బారులు తీరుతున్నారు.
ఇదిప్పుడు మరింతగా పెరిగింది. శుక్రవారం వచ్చిన 8,603 దరఖాస్తుల్లో 8100 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ వచ్చిన దరఖాస్తులే. గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న సభల్లోనూ ఇందిరమ్మ ఇండ్లపై రచ్చ మొదలైంది.
తమ పేరు రాలేదంటే తమ పేరు రాలేదని జనం గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్‌లోనైనా తమకు సొంత గూడు వస్తుందా అని వారి ఎదురుచూపులు మారలేదు. వారి ఆశలు ఇంకా చావలేదు. చిగురించాయి కూడా. ఐదు లక్షల సాయం ఎలా చేస్తారు..? ఎవరికి చేస్తారు..? దరఖాస్తులు చేసుకున్న వారిలో ఎవరిని ఎంపిక చేస్తారు…? అనేది చూడాల్సి ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు దక్కాలంటే అర్హత చాలదు. అదృష్టం కూడా కావాలి. అలాగే ఉంది మరి పరిస్థితి.