(దండుగుల శ్రీనివాస్)
కలెక్టర్లంటే మన లీడర్లకే లెక్కలేకుండా పోయింది. పార్టీ రంగులు పులుముతూ ఒకరు.. అధికారం దర్పం చూపుతూ మరొకరు ఇలా సందర్భమేదైనా.. లీడరెవరైనా కలెక్టర్లను మరీ చులకన చేసి మాట్లాడేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కలెక్టర్లకు విలువే లేకుండా పోయింది. ఈ మాట నేనడం లేదు. మన లీడర్లే వ్యవహార శైలి, వారి మాట తీరే పట్టిస్తున్నది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కరీంనగర్ కలెక్టర్‌పై నోరుజారాడు. పరువు దిగజార్చుకున్నాడు. తనకు వచ్చిన అసహనం, చికాకును ఇలా కలెక్టర్‌పై మీద నోరుపారేసుకోవడం ద్వారా అధికార దర్పాన్ని చూపుకున్నాడు మంత్రి. కలెక్టర్‌ను చులకన చేసే క్రమంలో తను మరీ చులకనైపోయారు.
ఇదిప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కి మంచి పేరున్నది. ఆమె అక్కడ బీఆరెస్ గవర్నమెంట్ కాలం నుంచే ఉన్నది. ఈ గవర్నమెంట్ రాగానే బదిలీ చేయాలనుకున్నారు. కానీ ఆమె శైలి మార్కు పాలన అందరికీ నచ్చంది. అందుకే ఆమెను అక్కడే కొనసాగించారు. సర్కార్ విద్యావ్యవస్థలో ఆమె తనదైన సంస్కరణలకు నాంది పలికారు. కలెక్టర్ ఎవరైనా వారికి మర్యాదిచ్చి నడుచుకోవాల్సిన బాధ్యతను కూడా మరిచారు మన లీడర్లు.
ఇటీవల కేటీఆర్ పలుమార్లు కలెక్లర్ల విషయంలో ఇలాగే నోరు జారాడు. జారుతూనే ఉన్నాడు. వికారాబాద్ కలెక్టర్ పై లగచర్లలో దాడి జరిగిన ఉదంతాన్ని కూడా కేటీఆర్ ఖండించలేదు. పైగా వారు కడుపు మంటతో దాడి చేసి ఉంటారంటూ కలెక్టర్‌పై దాడిని కూడా సమర్థించే స్థాయికి రాజకీయాలను దిగజార్చాడనే కోపం ఐఏఎస్‌ల సర్కిళ్లలో ఉంది. దీనికి తోడు సిరిసిల్లా కలెక్టర్ ను కేటీఆర్ కాంగ్రెస్ లీడర్‌గా అభివర్ణించాడు. ఇది కూడా వివాదమైంది.