(దండుగుల శ్రీనివాస్)
అసెంబ్లీ సమావేశాలు మరీ గబ్బు పట్టిపోయాయాబ్బ. మన నాయకులకు అధికారం లేకపోయే సరికి ఏం మాట్లాడుతున్నారో..! ఏం చేస్తున్నారో..!! వారికే అర్థం కావడం లేదు. నిజం చెప్పొద్దూ…. ఈ ఏడాది సమయంలో నాలుక్కర్చుకోవడాలు మరీ ఎక్కువయిపోయాయనుకో. హరీశ్ రావు మరీ దిగజారాడు. ఎంతలా అంటే అసెంబ్లీలో సభ్యులకు డ్రంకన్ డ్రైవ్ టెస్టు చేయాలట.
తెలిసి అన్నాడో. తెలియక అన్నాడో. తెలిసీ తెలియక ఫ్రస్ట్రేషన్ ఎక్కువై అన్నాడో. అధికార పార్టీ నోటికి ఇలాగైనా తాళం పడుతుందని అనుకుని అన్నాడో. తెలియదు. కానీ ఈ మాటలు మాత్రం వంద స్పీడ్‌తో తిరిగి వచ్చి హరీశ్‌ను, కేసీఆర్, కేటీఆర్‌ను ఆ పార్టీని గుద్దేసింది. తుక్కుతుక్కు చేసింది. నా బంగారు పుట్టలో వేలు పెడితే నే కుట్టనా అన్నట్టు ఇక అధికార పార్టీ సభ్యులు ఊకుంటారా..? ఉహూ అంటారా..! ఫైర్ అయ్యారు. మామూలు ఫైర్ కాదు. వైల్డ్ ఫైర్. మీ మామనే తాగుతాడు.. తాగి హెలికాప్టర్ దిగుతూ పడ్డ వీడియోలు చూపాలా..? అంటూ కౌంటర్ కామెంట్లు పెట్టారు.
సరే.. ఇవన్నీ ఒకెత్తు. జగ్గారెడ్డి స్టైలే వేరు కదా. అతను ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తాగడు. మీ మామ కేసీఆరే తాగుతాడు. ఆయనకే కష్టం.. అంటూ కొత్త విషయాన్ని చెప్పాడు. రేవంత్ తాగడు అనేది చాలా మందికి తెలియని విషయం. ఈ తాగుడు లొల్లి గెలికి రచ్చ చేసింది హరీశే కాబట్టి… ఇటూ అటూ తిరిగి మాంచిగా దున్యాతో సంబంధం లేకుండా ఫామ్ హౌజ్‌లో రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ ముడ్డి చుట్టూ దీన్ని తిప్పారు. పాపం ఆయన మానాన ఆయన ఏదో రోజుకు ఒకటి రెండు పెగ్గులు తాగుతున్నాడు కావొచ్చు. ఇప్పుడు ఆ లొల్లి కూడా బహిర్గతం చేయాలా..? మొన్న కాలుజారి కింద పడ్డప్పుడు కూడా బాగా తాగి పడ్డాడనే ప్రచారం చేశారు.
ఇగో ఇప్పుడు ప్రేమగల్ల అల్లుడు లేవనెత్తిన చీప్ కామెంట్స్ కాస్త మామ గోచికే చుట్టుకున్నట్టు.. డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేస్తే ఇక మీ మామ అసెంబ్లీకే రాడు అని జగ్గారెడ్డి సంబోధించడం పరిస్థితి ఎంతటి పీక్‌కు పోయిందో… దీనికి ఆద్యుడు, బాధ్యుడు ఎవరో జనాలకు తెలిసిపోయింది. ఔన్ … హరీశ్.. నువ్వో లాజిక్ మరిచిపోయావ్..! తాగనోడు ఎవడూ లేడు. నీతో సహా. ఎమ్మెల్యేలంతా తాగుతారు.
మీ పార్టీ సభ్యలుతో సహా. కానీ అసెంబ్లీకి.. అదీ పొద్దున్నే తాగి వచ్చేంత చవట వెధవలు ఎవరూ ఉండరోయ్.. నువ్వు మరీ చీప్ గా మాట్లాడి చీప్ అయిపోయావు. నీకు నీ బామ్మర్దికి ఈ మధ్య నాలుక బాగా మడతపడిపోతుంది. ఇలా అయితే జనాలు మడతెట్టేస్తారు మరి చూసుకో. మొత్తంగా ఈ ఎపిసోడ్‌ల్ అందరికీ అర్థమయిన విషయం.. రేవంత్ మందు తాగడు. కేసీఆర్ తాగుతాడు. ఇదేనా నువ్వు సాధించింది హరీశ్.