(దండుగుల శ్రీనివాస్)
కార్ రేసింగ్ స్కీం స్కాంలో కేటీఆర్ ఇరికిపోయాడు. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు అహంకారపూరితంగా వ్యవహరించి అడ్డంగా ఇప్పుడిలా బుక్ అయ్యాడు. అధికారులనూ బలిపెట్టబోతున్నాడు. ఈ కేసులో కేటీఆర్‌ను ఏసీబీ అరెస్టు చేయనుందనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో… బీఆరెస్ సోషల్ మీడియా తన కలాన్ని మరింత వేగంగా కదిలిస్తోంది.
యువరాజు నుంచి అరెస్టు ఆదేశాలు అందిందే తడవు… సోషల్ మీడియాలో శాంపిల్ పోస్టుల కళ్లాపి జల్లి వదిలారు. ఇక అరెస్టు కాగానే కేటీఆర్‌పై సానుభూతి వెల్లువెత్తేలా కవిత్వాలతో కూడిన కథనాలు.. ప్రాసలు, యాసలతో దండయాత్రలు చేసే పనిలో బీఆరెస్ సోషల్ మీడియా యమబిజీగా ఉంది. కేటీఆర్‌పై ఓ ఫోటో కూడా రెడీ చేసింది. అందంగా ముస్తాబు చేసిన అదే ఫోటోను .. కొణతం దిలీప్ వదిలిన శాంపిల్ రాతను ఎడాపెడా వాడేసుకుని సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తున్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి తపన పడటమే నేరమా..? ప్రపంచమంతా తిరిగి గ్లోబల్ దిగ్గజాలను నగరానికి పట్టుకు రావడమే పాపమా…?? అనే కవిత్వాన్ని శాంపిల్‌గా వదిలారు సోషల్ మీడియాలో. అరెస్టు తర్వాత ఎవరి కలం శక్తి ఎంతటితో జీతం తీసుకుంటున్న రేంజ్‌ను బట్టి ఈ కవిత్వాల వినిసొంపు కంపు కథనాలు, కామెంట్లు కుప్పలుతెప్పలుగా చెత్తకుప్పలుగా ఇక మనం చూసి తరించవచ్చు.