(దండుగుల శ్రీనివాస్)
హరీశ్‌రావు అప్పడప్పుడు ఇలా నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటాడు. జనాలకు దొరికిపోతూంటాడు. మంచివాడుగా పేరు తెచ్చుకునేందుకు ఏదో నటిస్తాడు తప్ప ఇలా అప్పుడప్పుడు తన అసలు రంగును బయటపెట్టుకుంటాడు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఏకంగా స్పీకర్‌ను బ్లాక్‌మెయిల్ చేయబోయి దొరికిపోయాడు. నాలుక్కర్చుకున్నాడు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ హరీశ్ బెదిరింపు, బ్లాక్‌మెయిల్ మాటల మర్మాన్ని పసిగట్టాడు. వెంటనే తిప్పికొట్టాడు.
దీంతో హరీశ్ తడబడ్డాడు. తత్తరపాటుకు గురయ్యాడు. అసలేం జరిగింది. హరీశ్ లేచాడు. లేవడం లేవడంతోనే స్పీకర్‌ను టార్గెట్ చేశాడు. ఏమని.? అధ్యక్ష ఈ సమావేశాలను వికారాబాద్ ప్రజలు చూస్తున్నారన్నాడు. అంటే… ప్రసాద్‌కుమార్ వికారాబాద్ ఎమ్మెల్యే కాబట్టి… మీ చేష్టలను మీ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు.. మిమ్మల్ని చీదరించుకుంటారు.. ఓడిస్తారని హరీశ్ మాటల వెనుక మర్మం. దీన్ని వెంటనే పసిగట్టిన స్పీకర్. దీన్ని ఒక్క వికారాబాద్ ప్రజలే కాదు..
రాష్ట్ర, దేశ, ప్రపంచ ప్రజలంతా చూస్తున్నారని కౌంటరిచ్చాడు. దీంతో తన బెదిరింపు మాటల మర్మం బెడిసికొట్టిందని గ్రహించిన హరీశ్‌కు ఆ తరువాత స్పీచ్‌లో నాలుక తడబడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను డిప్యూటీ స్పీకర్ అని సంబోధించాడు. దీన్ని గమనించిన స్పీకర్ సరిదిద్దాడు. డిప్యూటీ సీఎం అని సంబోధించండి అని కరెక్ట్ చేశాడు. అయినా హరీశ్ తడబడ్డాడు. సీఎం అని సంబోధించానని తనకు తానుగా అనుకొని .. మేం ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నాం.. అని తన మాటలను కవర్ చేసుకునే ప్రయత్నం చేసి మళ్లీ నాలుక్కర్చుకున్నాడు.
దీన్నీ గమనించిన స్పీకర్ మళ్లీ సర్దిచెప్పాడు. మీరన్నది డిప్యూటీ స్పీకర్ అని… ఆయన డిప్యూటీ సీఎం… అని ముసిముసి నవ్వులు నవ్వుతూ హరీశ్‌ను వెక్కిరింపు దోరణిలో చూశాడు. అప్పటికి తేరుకున్న హరీశ్.. గతంలో ఆయన డిప్యూటీ స్పీకర్‌గా కూడా చేశాడు కదా.. ఆయన నాకు మంచి మిత్రుడు అప్పట్ల.. అంటూ ఏదో కలరింగ్.. కవరింగు ఇచ్చుకున్నాడు…