(దండుగుల శ్రీనివాస్)
ఎమ్మెల్సీ కవిత ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నది. అధికారంలో ఉన్నప్పుడు తనవల్ల సాయం పొంది అణిగిమనిగి ఉన్న నేతలు.. తను జైలుకు పోయినంక.. అధికారం చేజారినంక మారిన ప్రవర్తనను ఆమె జీర్ణించుకోలేకపోతున్నది. ఒకప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆమె చెప్పిందే వేదం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడామె ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై నజర్ పెట్టింది. కోరుట్లలో బీఆరెస్ పార్టీ ఎమ్మెల్యే, వెలమ కులస్తుడే ఉన్నందున జగిత్యాల నుంచి ఫోకస్ పెట్టింది. అక్కడ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మంచి నటుడు. పరిస్థితులు మారాయి.
అప్పటి వరకు అక్కా.. అక్కా అంటూ ఆమె చుట్టూ కుక్కలా ప్రదక్షిణ చేశాడు. అధికారం చేజారడం, ఆమె జైలుకు వెళ్లడం మరుక్షణం కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోయాడు. దీన్ని ఆమె సీరియస్‌గా తీసుకున్నది. సమయం కోసం ఎదురుచూస్తున్నది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు ఆమెకు మంచి అవకాశంగా దొరికింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా డాక్టర్ సంజయ్‌పై తన ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు తన పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసేందుకు అక్క పక్కా ప్లాన్ వేసింది.
జగిత్యాలలో ఆదివారం పాత తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేసే అంశాన్ని ఎత్తుకొని ప్రభుత్వాన్ని కవ్వింపు చర్యలకు దింపింది. మీరు గెజిట్ ఇస్తే మాకేందీ… చూసుకుందాం.. రా..! అనే రేంజ్‌లో కయ్యానికి కాలు దువ్వింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న ఆమె.. ఇలా తన ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను తన పార్లమెంటు నియోజకవర్గం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రగిలించేందుకు ఈ వ్యూహం పన్నింది.