(దండుగుల శ్రీనివాస్)
సర్కార్ హాస్టళ్లలో ఆహారం అంటేనే అది నిర్లక్ష్యం, అవినీతితో కూడుకున్న వ్యవహారం. ఈ వ్యవస్థ అంతలా కలుషితమై పోయింది. అందుకే కలుషిత ఆహారం తిని… ఆహారం వికటించి ఆస్పత్రుల పాలైన విద్యార్థులు.. పలువురి ఆరోగ్యం విషమం… !! ఇలాంటి వార్తలు నిత్యకృత్యం. ఈ వార్తలు చూసీ చూసీ జనాలు కూడా వీటిని కామన్‌గా చూడటం మొదలుపెట్టారు. మార్పు మాత్రం రాలేదు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా.. బీఆరెస హయంలోని పదేళ్లలో ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆగలేదు. బిల్లులు రాలేదనే కారణం ఉండనే ఉంది. సర్కార్ కూడా అప్పుడు దీనిపై ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. ఏ సర్కారైనా సర్కార్ విద్య, వైద్యం..పై ఎక్కువ నిధులు పెట్టేందుకు ఇష్టపడదు. ఆ నిధులు గోడకు వేసిన సున్నంలాగే చూస్తాయి.
అందుకే ఆ వ్యవస్థలు అలా కునారిల్లుతూ వస్తున్నాయి. ఇప్పుడు టాపిక్ ప్రభుత్వ హాస్టళ్లలో సర్కార్ తీసుకున్న సంస్కరణల పర్వం గురించి. ఓ విద్యార్థిని చనిపోతేగానే సర్కార్ మేలుకోలేదనే అపవాదు ఉండొచ్చు. బీఆరెస్ నిలదీస్తే గానీ ప్రభుత్వం నిద్రలేవలేదనే విరమ్శలు రావొచ్చు.. మేం చేయడం వల్లే రేవంత్ సర్కార్ ఇప్పుడు ఇవన్నీ చేస్తోంది ..అని బీఆరెస్ పార్టీ నేతలు అనవచ్చు. ఎవరేమన్నా.. అంతిమంగా పేద విద్యార్దులకు, సర్కార్ హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు ఎంతో మేలు చేసే విప్లవాత్మకమైన నిర్ణయమే తీసుకున్నది సర్కార్. దీని అమలు ఎలా ఉండబోతుంది….? ఫలితాలు ఎలా ఉంటాయి..? అనేది మనం మున్ముందు చూడబోతున్నాం.
ప్రతిపక్షం అలా ఉండాలి…!
ప్రతిపక్షం ప్రజా సమస్యలపై సర్కార్‌ను ఎప్పుడూ నిలదీస్తూనే ఉండాలి. ఆ సమస్య పరిష్కారమయ్యేలా ఒత్తిడి పెంచుతూ ఉండాలి. సర్కార్ హాస్టళ్లు, గురుకులాలు, కస్తుర్బా పాఠశాలల్లో ఆహారం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. తెలిసీ ఎందుకు పంపుతారు… ? పేదరికం. దీనికి తోడు సర్కార్ పట్టింపులేని తనం తోడవ్వడంతో చదవు సంగతేమో గానీ, తిండి విషయంలో చచ్చే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. దీన్ని బీఆరెస్ ప్రశ్నించింది. రాజకీయ కోణమే కావొచ్చు. కానీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేసిన బీఆరెస్ వల్ల…సర్కార్ కూడా దానికి మరో చాన్స్ ఇవ్వొద్దనే నిర్ణయించుకున్నది. హాస్టళ్లలో పిల్లలు అక్కడి తిండి తిని చనిపోతున్నారనే అపవాదు సర్కార్‌కు మంచింది కాదు.
ఏ పాలకపక్షమూ దాన్ని అంగీకరించదు. రేవంత్ సర్కార్ మరింత స్పీడ్‌గా దీనిపై కదలింది. ఫలితంగా పిల్లల మెనూలో చాలా మార్పులు. నెలకు రెండు సార్లు మటన్, నాలుగు సార్లు చికెన్… నిత్యం గుడ్లు … పౌష్టికాహారం.. మంత్రులు, ఎంపీలు హాస్టళ్ల బాట … ఈ మార్పులు మంచివే. సర్కార్‌విద్య, అక్కడ లభించే ఆహారం… ఇప్పటి వరకు వాటిపై ఉన్న చెడు ప్రచారాన్ని పోగొడతాయి. సర్కార్ చర్యలతో వీటికి కొత్త జీవకళ రానుంది.