(దండుగుల శ్రీనివాస్)
ఎట్టకేలకు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్దమయ్యింది. ఈ- ఫార్మూలా కారు రేసు కేసులో గవర్నర్ నుంచి ప్రభుత్వానికి అనుమతి లభించింది. ఇక ఏసీబీ రంగంలోకి దిగనుంది. విచారణ చేపట్టనుంది. అరెస్టు చేసి జైలుకు పంపనుంది. రూ.55 కోట్లు హెచ్ఎండీఏకు చెందిన నిధులను అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ విదేశీ కంపెనీని బదిలీ చేయించాడు. దీంట్లో ఇద్దరు అధికారులు కూడా బలికాబోతున్నారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తే దాదాపు మూడు నెలల పాటు జైలులోనే ఉండే అవకాశం ఉంది. కాగా ఈ అరెస్టు పర్వంతో రేవంత్ అనుకున్నది సాధించాడని చెప్పొచ్చు. మొదటి నుంచి సీఎం… వీరి వెంట పడ్డాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా నడుస్తోంది.
దీంట్లో కూడా వీరి ప్రమేయం ఉందని తేలనుంది. ఆ కేసు కూడా కేసీఆర్, కేటీఆర్ మెడకు చుట్టుకోనుంది. ఆలోపే కారు రేస్ అంశంలో జరిగిన అవినీతి విషయంలో కేసు పెట్టేందుకు మార్గం సుగమమయ్యింది. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో కేటీఆర్ పై విచారణ ముమ్మరం కానుంది. దీంట్లో ఇక ప్రభుత్వం తాత్సారం చేసే పరిస్థితి లేదు. ఆ వెంటనే అరెస్టు కూడా చేసి జైలుకు పంపేందుకు సర్కార్ దూకుడు మీదుంది. ఈ క్రమంలో ఫామ్ హౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ఇక బయటకు రావాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది. కాగా ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆరెస్ పార్టీలకు రాజకీయంగా ఎవరికి మేలు జరుగుతుంది..? ఎవరికి నష్టం జరగనుందనే విషయాలు డిస్కషన్‌లోకి వస్తున్నాయి.
మధ్యలో బీజేపీ ఈ వ్యవహారాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నారు. గవర్నర్ అనుమతి విషయంలో కూడా కేటీఆర్‌ను అరెస్టు చేయడం ద్వారా ఈ రెండు పార్టీలు కొట్టుకుంటే మధ్యలో మాకు మేలు జరుగుతుందనే భావనలో బీజేపీ చూస్తున్నది. కాగా కేటీఆర్ అరెస్టు తరువాత ప్రభుత్వంపై బీఆరెస్ నుంచి మరింత ఒత్తిడి పెరగనుంది. హామీల అమలు విషయంలో జనాలతో కలిసి బీఆరెస్ ఉద్యమాలు చేసేందుకు రెడీ కానుంది. ఈ క్రమంలో రేవంత్ మరింత చాకచక్యంగా, ప్రజల నుంచి వ్యతిరేకత పెరగకుండా కూడా చూసుకోవాల్సిన అనివార్యత ఏర్పడనుంది.