(దండుగుల శ్రీనివాస్)
అప్పుడు బీఆరెస్‌ను కొంప ముంచిన ఘటన..ఇప్పుడు కాంగ్రెస్ మెడకు చుట్టే యత్నం చేస్తోంది బీఆరెస్. ఖమ్మం మిర్చీ రైతులకు బేడీలు వేసిన ఘటన అప్పట్లో కలకరం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై కేసీఆర్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. దీని ప్రభావం నుంచి బయటపడలేక పోయింది అప్పటి సర్కార్. కేసీఆర్ సర్కార్ ఘోర పరాభవంలో ఇదీ ఓ ప్రధాన కారణమనే విషయం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇదిప్పుడు ఎందుకు యాదికొస్తుందంటే లగచర్ల భూసేకరణ అంశాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ సర్కార్‌పై ఓ అస్త్రం గా ఎక్కుపెడుతోంది బీఆరెస్. కేటీఆర్ ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాడు.
వికారాబాద్ కలెక్టర్‌పై దాడికి సైతం అక్కడి లంబాడాలు దిగడం పై కేటీఆర్ అండ్ టీమ్ హస్తం ఉందని సర్కార్ భావించింది. మాజీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిని ఈ విషయంలో అరెస్టు కూడా చేశారు. ఆ తరువాత లగచర్లలో ఫార్మా కంపెనీ కాకుండా ఇతర పరిశ్రమలు పెడతామని, భూసేకరణ మాత్రం ఆగదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పి ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ సమస్య సమసి పోయిందని అంతా భావించారు. కానీ గురువారం హీర్యానాయక్ అనే ఖైదీకి అస్వస్థత కావడంతో బేడీలు వేసి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. దీన్ని ఇదే అదనుగా భావించి ఇక తన అస్త్రం ప్రయోగించింది బీఆరెస్.
ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశాడు సీఎం రేవంత్. బేడీలు వేసి ఎందుకు తీసుకెళ్లారని సీరియస్ అయ్యాడు. అయినా దీన్ని పలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని వెనుక సీఎం రేవంత్‌రెడ్డి భూదాహం ఉందని, ఈగో హర్ట్ కావడంతోనే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. లగచర్ల ఘటన రేవంత్ వెంట పడుతున్నది. నిన్ను వీడని నీడను నేనే అన్నట్టుగా ఈ అంశంలో ఏం జరిగినా దాన్ని సర్కార్‌కు ముడిపెట్టి సర్కార్ ను బద్నాం చేసే యత్నంలో కేటీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు.