సరిపోయారు ఇద్దరూనూ…!!
గురుతులు చెరుపుతూ ఒకరు..! వాటిని గల్లంతు చేస్తామని శపథం మరొకరు..!!
అధికారంలోకి రాగానే…! కేటీఆర్ నోటి వెంట పదే పదే ఈ మాటే..!!
అప్పుడే ఏడాదైంది…. కొంచెం ఓపిక పట్టండి యువరాజా…!!
విగ్రహాలను గాంధీభవన్‌కు తరలిస్తాం… ఓకే గానీ… ఇప్పుడే ఎందుకు తొందరపాటు..!
మీ నుంచి జనాలు కోరుకున్నది ఈ శపథాలు, ఈ మార్పులు కావు..!!
రాహుల్ గాంధీ లేఖలో మరోసారి బయటపడ్డ కేటీఆర్ డొల్ల మాటలు…
(దండుగుల శ్రీనివాస్)
ఒకరేమో కేసీఆర్ గురుతులే లేకుండా చేస్తానని శపథం పూనాడు. అవే చేస్తున్నాడు. జనాలకు ఇప్పుడేమవరసమో అవి కాదని, అప్పటి రాజకీయ కాంక్షలు, ఆకాంక్షలు, కక్షలకే ఎక్కువ ప్రయార్టీ ఇస్తూ వస్తున్నాడు. సహజంగానే ఈ విషయాలు జనాలకు చికాకును తెప్పిస్తున్నాయి. ఇబ్బంది పెడుతున్నాయి. కోపంతో ఉన్నారు. నేనేం తక్కువ కాదన్నట్టు దీనికి తగ్గట్టుగానే కేటీఆర్ కూడా శపథాలే చేస్తున్నాడు. ప్రజాకాంక్షలకు కాకుండా తన ఆకాంక్షలు.. కాంక్షలు, కసి మాటలకే ప్రయార్టీ ఇస్తున్నాడు. తాజాగా రాహుల్‌కు కేటీఆర్ రాసిన లేఖ రాజకీయంగా చర్చకు వస్తోంది. సుధీర్ఘ లేఖలో రేవంత్ ఇచ్చిన హామీలు, ఎందుకు అమలు చేయడం వరకు బాగానే ఉంది.
కానీ మధ్యలో ఈ అధికారంలోకి రాగానే.. అనే పదం ఉంది చూశారు. దీన్ని మాత్రం వదలడం లేదు కేటీఆర్. ఇప్పుడప్పుడే అధికారంలోకి ఎలా వస్తారు యువరాజా…! ఇంకా చాల సమయమే ఉంది. అప్పటి వరకు అధికారం పోయిందనే బాధను దిగమింగుకోవాలి. తప్పదు. కానీ మేం అధికారంలోకి రాగానే.. రాగానే.. రాగానే… ! ఇక ఈ పదం వాడటం ఆపేస్తే చాలు.. లేదంటే నీ ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్‌లో ఉందో తెలిసిపోతుంది. తెలిసిపోయింది కూడా. అధికారంలోకి రాగానే సచివాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ , తెలంగాణ తల్లి విగ్రహాలను గాంధీ భవన్‌కు తరలిస్తామని పదే పదే చెప్తూ వస్తున్నాడు కేటీఆర్. ఈ లేఖలో కూడా అదే అంశం హైలెట్ చేశాడు. సరే..! పంపితే పంపు గానీ… ఊకే ఎందుకు ఒర్రుడు. నీ నుంచి జనాలు ఇది కాదు కదా కోరుకున్నది.
కేసీయార్ అక్కడ ఫామ్‌హౌజ్‌లో సైలెంట్. నువ్వుమో ఇలా చెప్పాల్సింది చెప్పుకుండా మధ్యలో నీ పైత్యం. అధికారం కోల్పోయాననే దుగ్ద. ఇవన్నీ జనాలకు అవసరం లేదు కదా. అవును ఈ అధికారం ఎలా పోయిందబ్బా..! మీ వల్లే కదా. నీ వ్యవహార శైలి వల్లే కదా…! మరి ఆ జనాలు చీత్కరించుకున్నారనే విషయాన్ని అప్పుడే మరిచిపోయి…అదేదో జనాలే తప్పు చేశారు.. చెంపలేసుకుంటున్నారని నువ్వే డిసైడ్ అయిపోయి… ఇక మాకే అధికారం ఇచ్చేస్తున్నారని ఇప్పట్నుంచే కలలు కనేసి…!!
అబ్బబ్బ.. ఎందుకు ఈ లొల్లి. ప్రతిపక్షంగా డిమాండ్ చేయండి. జనం కోరుకున్నవేందో నిలదీసి సాధించే ప్రయత్నం చేయండి. చేయకపోతే అధికార పార్టీని వారే చీత్కరిస్తారు. కానీ ఇప్పుడే మీకు జనం అధికారం ఇచ్చేసినట్టు ఊహించుకోవద్దు. అవును.. వచ్చీ రాగానే మీరు కూడా ఈ విగ్రహాల తరలింపులు.. పేర్ల మార్పులు.. వీటి మీదే దృష్టి పెడతారా..? ఇంకేం పనులు లేవా మీకు..? జనాలు గొర్రెలు… మీకు అధికారం ఇస్తే ఇలా మార్పులు, గురుతులు.. తరలింపులు.. కక్షసాధింపులు…! అంతేనా…! వాడొద్దు.. వీడు..! వీడొద్దు.. వాడు..! అని జనం తిప్పి తిప్పి చెప్పినా.. తిరగేసి కొట్టినా.. మీరు మాత్రం మారరు. మిమ్మల్ని మార్చేది మాకేంటని..! అదే మాకేంటని…! మాకేం లేదు.. ఇగో అంతా మీ ఈగోలే. ఈ అధికార యావ గోలే..!!