(దండుగుల శ్రీనివాస్)
అసెంబ్లీ సమావేశాల సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పాడు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ఏదైనా సూటిగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడితే అది జనాలకు నచ్చుతుంది. అదే రేవంత్ నుంచి కోరుకున్నారు. గతంలో కూడా అవే అంచనాలతో ఉన్నారు. ఓట్లేశారు. గెలిపించుకున్నారు. సీఎంను చేశారు. కానీ ఆ తరువాత ఆయన తడపాటు తత్తరపాటు సంభాషణలు జనాలకు నచ్చడం లేదు. ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దం చెప్పాడు. అదేమంటే.. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాట చేయలేదని. నిజమే.
అధికారికంగా ఏర్పాటు చేయకున్నా… ఉద్యమ సమయం నుంచి పదేళ్ల బీఆరెస్ పాలన వరకు ఉన్నది ఒక్కటే తెలంగాణ తల్లి విగ్రహం. అది జనాలందరికీ తెలుసు. సీఎం హోదాలో రేవంత్ మాట్లాడితే అంతకు ముందున్న విగ్రహం రూపురేఖలు.. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కొత్త శిల్పం గురించి వివరంగా చెబితే బాగుండేది. కానీ అలా చేయలేదు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు తెలంగాణ తల్లి విగ్రహమే లేదన్నట్టుగా మాట్లాడటం బ్లండర్ మిస్టేక్. జనాలకు తెలంగాణ తల్లి అనగానే కళ్లెదుట స్పురించ ఓ శిల్పం ఉంది. అది కేసీఆర్ సృష్టించిందా..? బీఆరెస్ మానస పుత్రికా…? అనే విషయం పక్కన పెడితే అది జనాల్లో మెదల్లో నానుతున్న శిల్పం.
దాన్ని పోగెట్టి వేరే ఒక కొత్త రూపాన్ని రూపొందించి జనాల్లో మనసుల్లో జొప్పించే ప్రయత్నం చేసినప్పుడు ఎంతటి హుందాతనంతో వ్యవహరించాలి..? కానీ అలా వ్యవహరించలేదు సీఎం రేవంత్‌రెడ్డి. పక్కా అబద్దాలు చెప్పాడు. అదీ అసెంబ్లీ సాక్షిగా. కానీ మంత్రి సీతక్క చాలా నయం. సీఎం కన్నా. ఎందుకంటే అంతకు ముందున్న తెలంగాణ తల్లి శిల్పం.. అచ్చంగా కవితను పోలి ఉందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసింది. అందుకే మేము ఈ విధంగా శ్రమైక జీవనం ఉట్టి పడేలా…అందరికీ అమ్మాలా ఆశీర్వదించే మాతలా ఉన్న తెలంగాణ తల్లిని రూపుదిద్దామని చెప్పుకొచ్చారు. అంతకు ముందు కూడా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా అంతకు ముందున్న తెలంగాణ తల్లి శిల్పం దొరసానిలా ఉందని పరోక్షంగా కవితను ఉద్దేశించి మట్లాడిన విషయం తెలిసిందే.