జనతా గ్యారేజీ… మా గాంధీభవన్..!
మీ తెలంగాణ భవన్ కాదు..!!
ధర్నాచౌక్‌ను ఎత్తేసిన చరిత్ర మీది…!
ఎక్కడ ఏ ధర్నా జరిగినా వారితో చర్చించి పరిష్కరించే సంస్కారం మాది…!
కేసీఆర్‌ను మాస్ ర్యాగింగ్ చేసిన రేవంత్…!
వెటకారం, వ్యంగ్యాస్త్రాలతో కేసీఆర్ మీద పంచులు…!
80వేల పుస్తకాలు చదివిన విజ్ఞానం ఇదేనా..?
మేధావివి కదా ఇట్లా చేస్తున్నావెందుకు..??
రా బయటకు..! వచ్చి నీ సలహాలివ్వు… ఎలా ఎకరాకు కోటి దిగుబడి సాధిస్తున్నావు.. జర మాకు కూడా చెప్పు..!!
కుల గణనను నీ కుటుంబం వ్యతిరేకించింది….! మీరు బీసీ ద్రోహులు..
బీసీలంతా కేసీఆర్ కుటుంబాన్ని సాంఘీక బహిష్కరణ చేయాలి…!!
(దండుగుల శ్రీనివాస్)
ఈ మధ్య తెలంగాణ భవన్‌కు కేటీఆర్ కొత్త పేరు పెట్టుకున్నాడు. అదే జనతా గ్యారేజీ అని. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో నష్టపోయిన, మోసపోయిన ప్రజలంతా అక్కడికి వస్తున్నారంట… వారికి బీఆరెస్ శ్రేణులు బాసటగా నిలుస్తున్నారంట. దీనికి మంచి కౌంటరే ఇచ్చాడు సీఎం రేవంత్‌రెడ్డి. పెద్దపల్లి సభలో ఆయన స్పీచ్ ఇవాళ కొంత రొటీన్‌కు భిన్నంగా సాగింది. ధర్నా చౌక్‌ను ఎత్తేసింది మీరు… మేము ఎక్కడ ధర్నా చేసినా వారిని గాంధీభవన్‌కు పిలిచి మరీ మాట్లాడి వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం. అని ఇన్‌డైరె్క్టుగా గాంధీభవనే జనతా గ్యారేజీ అనే విధంగా సీఎం మాట్లాడాడు. చాలా రోజుల తరువాత మళ్లీ కేసీఆర్‌ను అర్సుకున్నాడు.
అట్లా ఇట్లా కాదు మాస్ ర్యాగింగే చేశాడు. 80వేల పుస్తకాలు చదివానంటున్నావు… ఆ తెలివి తేటలు ప్రజల బాగోగుల కోసం చూపడం లేదెందుకు..? ఎకరాకు కోటి రూపాయల దిగుబడి సాధిస్తున్నావు.. అదెలాగో మాకు చెప్తావా..? రా రైతువేదికల్లో చర్చ పెడదాం.. రైతులకు వివరిద్దాం.. అసెంబ్లీ కి రా చర్చిద్దాం.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కులగణనను కేసీఆర్ కుటుంబం అడ్డుకున్నదన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. వీరంతా బీసీ ద్రోహులేనని, బీసీ ద్రోహులైన వీరిని సాంఘీక బహిష్కరణ చేయాలని పిలుపునివ్వడం చర్చకు తెరతీసింది.
పదేండ్లలో ఎన్నో చేయాల్సి ఉన్నా చేయలేకపోయాడని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన సీఎం… కాళేశ్వరంలో అక్షరాల లక్ష రెండు వేల కోట్లు బుక్కాడని తీవ్ర ఆరోపణలు చేశాడు.పదేండ్లలో మీరేమీ చేయలేకపోయారు.. పదినెలలకే మేము ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నామని ప్రచారం చేస్తున్నారు… మాకు ఐదేండ్ల పాటు ప్రజలు పాలించేందుకు అవకాశం ఇచ్చారు.. అప్పటిదాకా ఆగుతారా లేదా అని కౌంటర్ ఇచ్చాడు.