(దండుగుల శ్రీనివాస్)
ఏడాది తరువాత సీఎంగా రేవంత్ హుందాగా సిద్దిపేట బహిరంగ సభలో తన విశ్వరూపాన్ని చూపాడు. మారిన మనిషినిగా మాట్లాడాడు. ప్రాక్టికల్ గా ప్రసంగించి పబ్లిక్‌ను ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు సాగిన బహిరంగ సభలు ఒకెత్తు.. ఇవాళ్టి సభ ఒకెత్తు అన్నట్టుగా సాగింది. ముఖ్యంగా ఐదు ముఖ్యమైన అంశాలపై రేవంత్ మాట్లాడాడు. పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో.. తను ఏంచేయాలనుకుంటున్నాడో వివరించాడు. ఇక విమర్శలు, తిట్లు, ఆరోపణలు జోలికి పెద్దగా పోననే విధంగా ఆయన ప్రసంగం కొనసాగింది. రేవంత్ పంచ్‌ల పరంపర కొనసాగిస్తూనే ఈ సభా వేదికగా పాంచ్ పటాకా విసిరాడు. చేసింది కొంతే అని ఒప్పుకున్నాడు. చేయాల్సింది ఇంకెంతో ఉందని హుందాగా అంగీకరించాడు.
ఇక తన పని అదేనని ప్రజలకు విశ్వాసం కలిగించేలా మాట్లాడాడు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ సర్కార్ ఏమేమీ చేసిందో వివరంగా విశదీకరించాడు. 50వేల ఉద్యోగాలిచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుని నిరుద్యోగులకు బాసటగా నిలుస్తున్నామన్నారు. నాడు బీఆరెస్ సర్కార్ ఉద్యోగాల కల్పన విషయంలో చేసిన తప్పిదాలను, నిర్లక్ష్యాలను కళ్లముందుంచాడు. ఒకరేమో పదేళ్లు పాలించి ఫామ్‌హౌజ్‌కు పరిమితం కాగా.. పదకొండేండ్లు పాలిస్తున్న మోడీ రైతులకు సంబంధించి నల్ల చట్టాలు తెచ్చి చెంపలేసుకున్నాడని, వీరిద్దరూ ఇప్పుడు రైతుల గురించి సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. 9న తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు.. తనదైన పాలన గురించి కూడా ప్రజలకు వివరించి వారి ఆమోదం తీసుకున్నాడు.
కేటీఆర్, కేసీఆర్ అరెస్టు తనకో లెక్కకాదని పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు రేవంత్ రెడ్డి. వీరి అరెస్టు తనకు ముఖ్యం కాదని, ప్రజా పాలన తనకు ముఖ్యమన్నారు. వీరిపై టైమ్ కేటాయిస్తే ప్రజలకు నష్టం జరుగుతుందని, అందుకే వారిని వదిలేశానన్నాడు.