(దండుగుల శ్రీనివాస్)
పాలమూరు సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఓ వ్యూహంలో భాగమా..? ఎప్పట్నుంచో తన మనసులో ఉన్నదే ఇక్కడ బయట పెట్టాడా..? ఈ వేదికగా మాట్లాడిన తన మాటల ద్వారా ఓ మూడు సంకేతాలను ప్రజలకు, పొలిటికల్ సర్కిళ్‌కు పంపాడా..? నిన్నటి సభ ఆసాంతం పరిశీలనగా చూస్తే అవును.. ఇది నిజమేననిపిస్తుంది. చాలా మంది సీఎం ప్రసంగం తీరు పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఆశ్చర్యపోయారు. కానీ దీన్ని లోతుగా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ సభను తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుకు అనుకూలంగా మలుచుకునే క్రమలోనే ఈ స్టెప్ వేసినట్టుగా అనుకోవచ్చు. ఓ రకంగా సీఎం హోదాను పక్కనబెట్టి రేవంత్ తెగించే మాట్టాడాడని భావించారు.
మొదటగా తన సొంత గడ్డకు ఏడాదికి 20వేల కోట్ల చొప్పున మొత్తం లక్ష కోట్ల వరకు ఖర్చు చేసేందుకు కూడా తాను సిద్దమేనన్నాడు. పనిలో పనిగా వేదిక మీద అందరి మంత్రుల ఆమోదం తీసుకున్నట్టుగానే సానుభూతి వచనాలు, పాలమూరు నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు వివరించి వారిముందుంచాడు. వారి మౌనం, చిరునవ్వే అంగీకారంగా సభలో ప్రస్పుటింపజేశాడు. అంతకు ముందు స్పీచ్ ఆరంభమే మంత్రివర్గాన్ని, సీనియర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసి సఫలమయ్యాడు రేవంత్. తనకు సీనియారిటీ లేకపోయినా.. కనీసం కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేయకపోయినా.. పాలమూరు బిడ్డకు ఈ అవకాశం ఇవ్వాలని పెద్దలంతా పెద్ద మనుసు చేసుకుని తనకు సీఎం పదవిలో కూర్చోబెట్టారని, తన నేపథ్యాన్ని, ప్రాంతీయతను కూడా ఆపాదించుకున్నాడు.దీంతో సీనియర్లు ఇక ఏం మాట్లాడలేని పరిస్థితి కల్పించాడు. ఆ వేదిక మీద మాట్లాడకపోయినా… తరువాత కూడా ఇది డిస్కషన్‌కు రాకుండా చేశాడు.
మెచ్చుకున్నాడు.. పెద్ద మనుసుతో అని అభివర్ణించాడు… పాలమూరు బిడ్డ అని వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన అనే సానుభూతిని జోడించాడు.. ఇవన్నీ కూడా వారిని ఇబ్బందికర పరిస్తితుల్లో నెట్టివేస్తూనే ఏమీ అనలేని విధంగా చేష్టలుడిగి చూస్తుండిపోయేలా చేశాడు. ఇక ఇందులోనే మరో సంకేతాన్ని కూడా పంపాడు రేవంత్.. అదేమిటంటే.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు .. ఇక సీఎం మారుతాడు.. ఏడాది కోసం మాత్రమే రేవంత్‌ను కొనసాగస్తారు… ఏడాదిలోనే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ పార్టీకి , ప్రభుత్వానికి నష్టం కలిగించారని సీనియర్లు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారనే ప్రచారం చేసి గందరగోళం సృష్టించాలని భావించారు. దీనికి కూడా ఇదే వేదికగా చెక్ పెట్టాడు రేవంత్. ఇక తనే పూర్తి స్థాయి సీఎంనని తేటతెల్లం చేశాడు.
వేదిక మీద పెద్దలంతా తననే సీఎంగా ఉండాలని కోరుకున్నారని, అందుకే ఈ పొజిషన్‌లో వారి ఆశీస్సులతోనే ఉన్నానని హార్ట్ టచింగ్ కామెంట్స్‌తో వారిని కట్టిపడేశాడు. నోటికి తాళం వేశాడు. గడుసుతనంగా లక్ష కోట్లు ఖర్చు పెడతానని ప్రకటించడం కూడా తన రాజకీయ వ్యూహంలో భాగమే. తను సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి మేలు చేయవచ్చనే భావనతో పాటు.. ఎక్కువ నిధులు తెచ్చుకుంటున్నాను.. ఇక మీరు ఎంత గగ్గోలు పెట్టినా.. ఎంత రాజకీయం చేసినా ఆపేది లేదు.. నేను ఆగేది లేదని మొండిగా ఈ వేదికగా చెప్పేశాడు. ఇక దీనిపై ఎంత రాజకీయ చర్చ , రచ్చ జరిగినా ముందుకే తప్ప వెనక్కి తగ్గేది లేదనే సంకేతం కూడా ఇచ్చాడు రేవంత్. రేవంత్ వ్యూహం ఏదైనా పాలమూరు బిడ్డలు మాత్రం ఖుషీ ఖుషీగా ఉన్నారు.