(దండుగుల శ్రీనివాస్)
రేవంత్ స్పీచ్ అచ్చంగా చంటి లోకల్ అన్నట్టుగానే సాగింది. రైతు పండుగ ముగింపు సభలో పాల్గొన్న సీఎం స్పీచ్ పట్ల అంతా ఆసక్తిగా గమనించారు. అనుకున్నంతగా చెప్పుకోదగ్గ స్పీచ్ ఏమీ రాలేదు ఆయన నుంచి. పక్కగా లోకల్ ప్రజాప్రతినిధిగానే ఆయన ప్రసంగం కొనసాగింది. వేదిక మీద మంత్రి మండలిని మొత్తం పెట్టుకుని తన సొంత ఇలాఖ అభివృద్ధి కోసం చెప్పుకోవడం.. అందుకు మీరంతా సహకరించడని ఈ వేదికగా వేడుకోవడం… లక్ష కోట్లు ఖర్చు చేస్తానని ప్రకటించడం … కనీసం వేదిక మీద పెద్దలు కూడా దీన్ని ఊహించలేకపోయారు. విస్మయం వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డగా.. అక్కడ ప్రజల కష్టనష్టాలు తెలిసిన సీఎంగా తను ఏంచేయాలో.. ఏం చేస్తున్నానో చెప్పుకోవడం సందర్భం.
కానీ ఆ ప్రసంగం ఆసాంతం అదే ఉండటం మిగితావారికే కాదు.. సాక్షాత్తూ ఆ పార్టీ పెద్దలకే విసుగు, విస్మయం కలిగించాయంటే ప్రసంగం దారితప్పిందని అర్థం అవుతోంది. రైతు రుణమాఫీపై దేశ ప్రధానికే సవాల్ విసిరాడు సీఎం. ఇలా ఏకబిగిన ఇంత పెద్దమొత్తంలో రైతు రుణమాఫీ చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా…? రండి చర్చకు అని సవాల్ విసిరాడు. ఇదొక్కటే ఇందులో చెప్పుకోదగ్గ అంశం. ఇక మిగిలిందంతా ఇండియట్ సినిమాలో హీరో రవితేజ ఫేమస్ డైలాగ్ …. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు.. చంటి గాడు లోకల్… ఇక్కడే ఉంటాడు…! సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది రేవంత్ స్పీచ్.
లగచర్లలో పరిశ్రమలు పెట్టి తీరుతానన్నాడు. పదిలక్షలు కాకపోతే 20 లక్షల పరిహారమైనా ఇస్తానని ప్రకటించాడు. తనకు సపోర్టు చేయాల్సిందిగా అక్కడి జనాలను కోరాడు. బీఆరెస్ మాయలో పడొద్దని విజ్ఞప్తి చేశాడు. తన కోణంలో, తన ప్రాంతం గురించే మాట్లాడుకుంటూ పోయిన రేవంత్… మిగిలిన జిల్లాల పరిస్థితి, అక్కడ ప్రజలు చూస్తున్నారనే సోయి కూడా లేకుండా మాట్లాడడనిపిస్తుంది. రేపు మరెక్కడా భూసేకరణ జరపాల్సి వస్తే.. ఇంత ప్రయార్టీ ఇచ్చి పరిహారం ఇస్తాడా..? ఆయా జిల్లాల అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయిస్తాడు…? అదే వేదికపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ ఉన్నాడు… మరి ఆయన సొంత జిల్లా నిజామాబాద్‌కు ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చుకుంటాడు…? ఇనవ్నీ చర్చకు తెరలేపే అంశాలు.
ఓవైపు అప్పులు చేసి నెత్తి మీద మిత్తీల భారం పెట్టి పోయాడని గగ్గోలు పెట్టేది మనమే. మళ్లీ లక్ష కోట్లు ఇక్కడే ఖర్చుపెడతానని ప్రకటించడమెందుకు..? ఇక రైతు భరోసా గురించి సీఎం కనీసం టాపిక్ ఎత్తకపోవడం.. అంతకు ముందు మంత్రి తుమ్మల .. రైతులు రైతు భరోసా కంటే .. బోనస్ ద్వారానే హ్యాపీగా ఉన్నారని పరోక్షంగా రైతుభరోసా ప్రభుత్వానికి భారమనే విధంగానే మాట్లాడారు. దీనిపై ఓవైపు బీఆరెస్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తోంది.. రైతుబందుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్.. అని .. కనీసం దీనిపై క్లారిటీ ఇవ్వకసోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.