(దండుగుల శ్రీనివాస్)
ఇలా ఏడాది పూర్తయ్యిందో లేదో అలా విజయోత్సవాలు జరుపుకోవాలని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్ సర్కార్. భట్టి ఇవాళ దీనికి సంబంధించిన షెడ్యూల్ ఒకటి ప్రకటించేశాడు కూడా నవంబర్ 14 నెహ్రూ పుట్టిన రోజు నుంచి మొదలుకొని డిసెంబర్ 9 సోనియా బర్త్ డే వరకు విజయోత్సవాలు జరుపుకోవాలట. అసలు రాష్ట్రంలో ఏ సెక్షన్ పీపుల్ సంతోషంగా ఉన్నారని భావిస్తున్నారు మిస్టర్ భట్టి. అధిష్టానికి మీరంతా వీర విధేయులే కావొచ్చు. చాన్సు వస్తే ఏదైనా చేసి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు కావాల్సింది ఇది కాదు. సంపూర్ణ రుణమాఫీ. ఒకవేళ మీరు విజయోత్సవాలు చేయదలిస్తే అందులో వీటిని పొందుపర్చండి. మీకు మద్దతు లభిస్తుంది.
రుణమాఫీ సంపూర్ణంగా ఇవ్వడంతో పాటు.. రైతు భరోసా నిధులు రిలీజ్ చేయండి. ఖాతాల్లో అమౌంట్ వేయండి. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను ప్రకటించండి. 4వేల పింఛన్ అమలుపై క్లారిటీ ఇవ్వండి…. ఇలా చాలానే ఉన్నాయి మీరు చేయాల్సింది. బడ్జెట్‌ను అనుసరించి పథకాల అమలుకు ఈ విజయోత్సవాల్లో శ్రీకారం చుట్టంది. మేము అనుకున్నది కాంగ్రెస్ సర్కార్ మెల్లగానైనా చేస్తున్నదనే ఫీలింగ్ కల్పించంది. ఏడాది కూడా పూర్తి కాకముందే కొండంత వ్యతిరేకతను నెత్తిన మోసే మీరు.. ఆ భారం కొంచెం కొంచెమైనా దించుకోండి. మూసి వెంట పరుగులు ఆపండి. రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాలన్నీ మూసీతోనే ముడిపడి ఉన్నాయనే రేంజ్‌లో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించడం మానుకోమని చెప్పండి.
అదే పనిగా ప్రతిపక్షాల వెంట పడి మూసీ రాజకీయాలు చేయడం ఆపేయమనండి. మీకో ప్లానింగ్ ఉంది క దా. దాన్ని అనుసరించి సైలెంట్‌గా చేసే పని చేసుకుంట పోండి. ఆ కంఠశోష వచ్చేలా… బుల్డోజర్లతో తొక్కిస్తా… మూసీలో ముంచుతా.. ఎందుకీ బాలయ్యబాబు డవిలాగులు. ఏవగింపు కలిగేదాకా చూడకండి. జనాలకు చేరువయ్యేందుకు ఇంకా చాల సమయం ఉంది. అలా అని తిట్ల దండకాలు.. శాపనార్ధాలకు చాన్వివ్వకండి.. ఏదో పేపర్లో చదవిన సన్నాలకు బోనస్ 500 ఇచ్చేందుకు వెయ్యి కోట్లు రెడీ చేసుకుంటున్నారట కదా… అగో గిసుంటి పనులు చేయండి.. ఈ విజయోత్సవాల్లో… జర జనాల నాడి అర్థం చేసుకోర్రి.. మీరూ కేసీఆర్ లెక్కనే పోయి బొక్కలో పడకుండ్రి.