(దండుగుల శ్రీనివాస్)
మళ్లీ అవ్వే మాటలు కేసీఆర్ నోట. తనను ఓడగొట్టడమే ప్రజలు చేసిన అతి పెద్ద తప్పిదంలా.. అది వారికి తగిన శాస్తి జరిగేదాకా తను కళ్లారా చూడాలనే అదే పైశాచిక దోరణే తప్ప ఆయనలో ఇంకా మార్పురాలేదు. రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఏడాది పాటు జనం మీద అలిగి బయటకు రాలేదు. చప్పుడు చేయలేదు. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దేశాన్ని ఆగం పట్టిస్తా అన్న యుద్దవీరుడు కత్తిబల్లెం పక్కన పడేసి అలిగి కూసున్నడు. ఇప్పుడు నింపాదిగా బయటకు ఇలా వచ్చి బీఆరెస్ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. చేయాల్సిందే. పార్టీని, నాయకులను కాపాడుకోవాల్సిందే. మధ్యలో వచ్చిన తాలు, తుక్కు వల్ల, తండ్రీకొడుకుల అనాలోచిత నిర్ణయాల వల్లే పార్టీకి ఇవాళ ఈ గతి పట్టింది. అధికారం కోల్పోయింది.
అంతలా మిడిసిపడిన తమకు ఇంతటి గుణపాఠం జనాలు ఎందుకు నేర్పాలనుకున్నారు..? మా తప్పిదాలేమిటి..? అని ఆలోచించారా..? లేదు. ఇవాళ బయటకు వచ్చి తప్పుడు నిర్ణయం తీసుకున్నరు. ఆగమైండ్రు.. అనుభవిస్తున్నరు.. అనే విధంగా కేసీఆర్ మాట్లాడటం ఆయనలోని అదే దొరతనం, అహంకారం, జనం మీద కక్ష ఏవగింపు దోరణిని పట్టించాయి. సిట్టింగు ఎమ్మెల్యేలకు చాన్సుల మీద చాన్సులిచ్చి వారిని పెంచి పోషించింది నువ్వు కాదా..? ఎంతటి అరాచకాలు,అవినీతికి తెరలేపి జనం మాన ప్రాణాలతో ఆడుకున్న ఆ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చుకోలేకపోయావు.
జనం అంటే చిన్నచూపా..? వారిని మార్చే దమ్ము లేని పిరికితనమా..? అందుకే నువ్వు కొడుకు అనుభవిస్తున్నారు. ఇంకా ఏడాదే అయ్యింది. జనం మార్పుకోరుకున్నారు. నిన్ను మార్చాలనుకున్నారు. ఎమ్మెల్యేలను ఇళ్లకు, ఫామ్‌హౌజ్‌లకు పరిమితం చేయాలనుకున్నరు. చేశారు. అది గ్రహించావా..? గ్రహించి, గమనించి లైట్ తీసుకున్నావా..? అలా అయితే నిన్నూ ఇంకా లైట్‌గా చూస్తారు జనాలు. ఇవాళ నువ్వు మాట్లాడుతుంటే నీ పక్కనే ఉన్న ఓ మాజీ అరాచకశక్తి నీకు తెల్వదా..? ఎందుకు ఇంకా నీ చంకలో పెట్టుకు తిరుగుతున్నవ్..! ఇగో ఇలాంటి పొరపాట్లు, లోపాలు, అహంకారపు చర్యలు, ఆలోచనలు అన్నీ అన్నీ తెలిసే.. తెలియక కాదు చేశావు. అనుభవిస్తున్నావు. అప్పుడు ఎన్నికలప్పుడూ ఇలాగే అన్నావ్. నాదేం పోయింది.. ఓడిపోతే ఫామ్‌హౌజ్‌కే పరిమితమైతా.. మీకే నష్టం. ఎవడన్నా లీడరు.. జనం మేలు కోరేవాడు మాట్లాడే మాటలేన అవి. అంటే జనం అంతకు అంత అనుభవిస్తే నువ్వు ఒడ్డు మీద కూసుని చలిమంటలేసుకుని పగలబడి నవ్వుతూ చూస్తావా..?
ఈ పదకొండు నెలలు అదే చేశానని ఒప్పుకుంటున్నావా..? ఇన్నాళ్లకు బయటకు వచ్చీ అవే మాటలన్నాడు. మాదేం పోలేదు. మా పార్టీకేమైతది. అది అట్లనే ఉంటది. పార్టీ ఉంటది. మీ మాజీలు కూడా అట్లనే ఉంటరు. నిన్ను నిండా ముంచుతందుకు. వాళ్లకే కష్టం వచ్చిందంటూ జనం మీద జాలి మాటల సానుభూతి వెల్లువ వ్యాఖ్యలు.. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించిన చందంగానే ఉన్న విషయం తేటతెల్లమైంది. మనదే అధికారం సరే. ఎప్పుడు ఎన్నికలు. అప్పటి దాకా పార్టీని, ఉద్యమాన్ని నమ్ముకున్న వారిని ఇకనైనా కాపాడుకునే సోయి ఉండాలె కదా. రాజకీయ పునరేకీకరణ పేరుతో నువ్వు చేసిన అరాచక రాజకీయం నిన్ను ఇలా ఏకాకిని, అనాథను చేసింది. అనుభవిస్తున్నావు. అయినా ఇంకా బుద్దిరాలేదు. ఉద్యమకారులింకా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. వారిని ఇకనైనా పట్టించుకో. జిల్లాకొక పార్టీ భవన నిర్మాణం చేసినవ్. దానికి అధ్యక్షులెవరున్నారో చూసుకో. ఎక్కడికి పారిపోయి తలదాచుకున్నారో తెలుసుకో. వారిని మార్చు. జనం మార్పు కోరుకున్నరు. కోరుకుంటారు. మీరు మారకపోతే మారేదాక మారుస్తనే ఉంటరు.