(దండుగుల శ్రీనివాస్)
సీఎం రేవంత్‌రెడ్డి మంచి క్లారిటీతో ఉన్నాడు. కేసీఆర్, కేటీఆర్ అండ్ టీమ్‌పై వలపన్ని అదును చూసి లోపలేసేందుకు అంతా రెడీ చేసుకుంటున్నాడు. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అత్యుత్సాహం కాస్త ఈ ఆపరేషన్‌ను లీక్ చేసి ఆగం ప్రకటనలతో అయోమయాన్ని సృష్టించింది. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందనే అపవాదును మూటగట్టుకున్నది. అసలేం జరిగింది…? దీపావళి ముందే రాజకీయ బాంబులు పేలుతాయని పొంగులేటి చేసిన ప్రకటన ఆంతర్యమేమిటీ..? ఎందుకు అది పేలలేదు. ఈ మాటలు ఉత్త కుక్క పటాకుల తరహాలోనే తుస్సుమన్నాయా..? లేక త్వరలో సుతిలీ బాంబులై పేలనున్నాయా..? ఇప్పుడు అందరి మదిలో ఇవే ఆలోచనలు…
జన్వాడా ఫామ్‌హౌజ్ లో రేవ్ పార్టీ తరహా కేటీఆర్ అండ్ టీమ్‌తో కలిసి ఓ పార్టీ జరగబోతుందని ప్రభుత్వానికి ముందే సమాచారం అందింది. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలతో పాటు కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులు.. కేటీఆర్ కూడా ఈ పార్టీకి హాజరవుతారని ముందే సమాచారం లీకయ్యింది. దీనిపై అప్రమత్తంగా ఉంది సర్కార్. రేవంత్ ఆదేశాల మేరకు అంతా సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడా ఎవరికి ఏ అనుమానం రాకుండా సమయం కోసం చూస్తున్నారు. కచ్చితంగా ఆ పార్టీలో డ్రగ్స్ వాడుతారనే అనుమానాలు సర్కార్‌కు ఉన్నాయి. కేటీఆర్ దీనికి హాజరైనా కాకపోయినా.. బామ్మర్ది అండ్ టీమ్‌లో ఏ ఒక్కరు డ్రగ్స్ తీసుకున్నట్టు దొరికినా కేటీఆర్‌ను బద్నాం చేయొచ్చని భావించింది సర్కార్. లింకు కేటీఆర్ మెడకు పెట్టి ఆగంఆగం చేయాలనుకున్నది. ఆపరేషన్ సైలెంట్‌గా కొనసాగుతున్నది. కానీ మంత్రి పొంగులేటి అత్యుత్సాహం ఇదంతా చెడగొట్టింది. దీపావళికి ముందే రాజకీయ బాంబులు పేలుతాయి అంటూ సమయం సందర్భంగా లేకుండా ఎక్కడో మూసీపై అధ్యయనానికి వెళ్లిన టూర్‌లో మీడియాతో మాట్లాడి నాలుక్కర్చుకున్నాడు.
అప్పటికే కొంత డౌట్ వచ్చినట్టుంది కేటీఆర్ అండ్ టీమ్‌కు. కానీ ఈ పార్టీపై ఎవరు దాడి చేస్తారులే అని లైట్‌గా తీసుకుని ఉంటారు. సమయం రానే వచ్చింది. దాడి జరిగింది. కానీ దీంట్లో కేటీఆర్ లేడు. బామ్మర్ది రాజ్ పాకాల పారిపోయాడు. రాజ్ పాకాల దోస్తు విజయ్ మద్దూరి దొరికాడు. విజయ్ డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. కానీ విజయ్ అక్కడ డ్రగ్స్ తీసుకోలేదు. ప్రపంచ యాత్ర చేస్తున్నానని చెప్పుకున్న విజయ్ .. ఎక్కడో ఇతర దేశంలో డ్రగ్స్ తీసుకుని వచ్చాడు. ఒక్కసారి డ్రగ్ తీసుకున్నాక దాదాపు 120 రోజుల పాటు అది అతని శరీరంలో ఉంటుంది. దీంతో అతడికి పాజిటివ్ వచ్చింది. ఇదే సర్కార్‌కు ఆయువు పట్టుగా మారింది. ఎంత యాగీ చేయాలో అంత చేశారు. ఆపరేషన్ మాత్రం డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. అన్నట్టుగానే మిగిలిపోయింది. పొంగులేటి దీపావళికి ముందు పేలుతాయన్న రాజకీయ బాంబు గిదే. హనుమంతుడిని చేయబోతే కోతి అయిందన్నట్టుగా అది సుతిలీబాంబు కాదు… కుక్క పటాకయ్యింది.
లేటుగా పేలుతాయి… వదిలిపెట్టేలా లేరు..
నెంబర్ వన్ టు నెంబర్ 8 వరకు అందరిపై కేసులుంటాయని , అరెస్టులుంటాయని కూడా పొంగులేటి అదే మీడియాతో అక్కడ మాట్లాడాడు. అంటే దీని అర్థం.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు మాజీ మంత్రులకు కూడా అవినీతి మరకల విషయంలో కూలంకశంగా లోతులు గుంజి కేసులు పెట్టి లోపలేయాలని సర్కార్ భావించింది. త్వరలో వీటికి సంబంధించిన వాటిపై క్లారిటీ రానుంది. ఆలోపే కంపు కంపు చేసేశాడు పొంగులేటి. దీనిపై సీఎం రేవంత్ కూడా అసంతృప్తిగానే ఉన్నాడు. కక్షపూరితంగా కేసులు పెట్టినట్టు కాకుండా.. దోషులుగా తేల్చి కేసులు పెట్టి లోపలేశారని ప్రజలు అర్థం చేసుకునేలా ముందుకు పోవాలకున్నారు. కానీ కేటీఆర్ బామ్మర్ధి అంతా చెడగొట్టాడు. పొంగులేటి దీంట్లో అత్యుత్సాహం ప్రదర్శించి సర్కార్‌కు అపవాదును తెచ్చిపెట్టేలా వ్యవహరించాడు. మరి ఇక బాంబులు లేనట్టేనా..? దీపావళి ముగిసింది కదా అనే కదా మీ డౌట్. బాంబులు కచ్చితంగా పేలుతాయి. కానీ ఆలస్యంగా. కొంత సమయం తీసుకుని ఈ అరెస్టుల పర్వం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ వీరిని వదలేలా లేడు. దీపావళి కాకపోతే క్రిస్మస్… అదీ కాకపోతే న్యూ ఇయర్.. అదీ కుదరకపోతే సంక్రాంతి. కానీ పేలడం మాత్రం పక్కా.