(దండుగుల శ్రీనివాస్)
పాత ముచ్చటే. అందరికీ తెలిసిందే. కానీ అందరూ ఒప్పుకోని విషయం. రాహుల్ గాంధీని నమ్ముకుంటే ఇక కాంగ్రెస్ బాగుపడదని. వాస్తవాలు ఇలాగే చేదుగా ఉంటాయి. ప్రియాంక గాంధీని పక్కన పెట్టి రాహుల్ పార్టీకి ఎంతటి ద్రోహం చేస్తున్నాడో కళ్లముందు ఫలితాలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రియాంకకు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు, అధికారాలు ఇవ్వరాదనేది రాహుల్ పంతం. సోనియాకు ప్రియాంక శక్తి యుక్తులు తెలుసు. కానీ కొడుకుకు భయపడుతున్నది. ఆమెను ప్రచారంలో పూర్తిగా స్వేచ్చగా తిరిగనిస్తే.. పార్టీ భవిష్యత్‌కు ఆమె కొత్త చరిత్ర లిఖించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ విషయం సోనియాకు తెలుసు. రాహుల్‌కూ తెలుసు.
కానీ ఒకరేమే ఏమీ చేయలేరు. ఇంకొకరేమో తనకు చాతకాదని తెలిసినా.. ఆమెకు మాత్రం చాన్సు ఇవ్వొద్దు… ఎదగనీయొద్దు.. అనే దుగ్ధ. అంతిమంగా పార్టీ ఎగిసిపడిన కెరటంలా అలా పడి లేస్తూ .. లేస్తూ పడుతూ ఉందే తప్ప… అధికారంలోకి రావడం లేదు. ఇంత నష్టం జరిగినా ఇంకా తేరుకోని సోనియా , రాహుల్ చర్యల మూల్యమే హరియాణా ఫలితాలు. అక్కడ కాంగ్రెస్ అధికారం దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉండే. కానీ రాహుల్‌ను జనం అక్కడే కాదు ఎక్కడా నమ్మడం లేదు. అందుకే మొన్నటి రిజల్టు అలా చావు తప్పి కన్ను లొట్ట బోయినట్టు వచ్చాయి. ఇగో ఇప్పుడు హరియాణాలో కూడా అదే జరిగింది. ప్రియాంక గాంధీని పోలింగుకు చివర నాలుగు రోజులు మాత్రమే ప్రచారం చేసే చాన్సు ఇచ్చారిక్కడ. ఇంత కన్నా దౌర్బాగ్యం మరొకటి లేదనుకున్నారు పార్టీ గురించి వాస్తవం తెలిసిన వారు. వారు అనుకున్నట్టే జరిగింది. రిజల్టు తారుమారయ్యింది. మోడీకి జీవం పోశాడిలా రాహుల్ గాంధీ. వాస్తవానికి మోడీ చరిష్మా తగ్గుతూ వస్తోంది.
అంతా విసిగి వేసారి పోయారు. ఇక చాలురా బాబు అనే పరిస్థితికి వచ్చారు. కానీ అక్కడ ప్రతిపక్షం కాంగ్రెస్‌లో రాహుల్ కనిపిస్తున్నాడు. ఏదో సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉండే… ఆ తల్లికి తల్లి కావడమే నీకు శాపమే తల్లీ.. ! అని. ఇప్పుడు రాహుల్ సోనియాకు కొడుకు కావడమే ఆ పార్టీకి శాపంగా మారింది. పార్టీ ప్రెసిడెంట్ గిరీ నుంచి తన తప్పు తెలుసుకుని హుందాగా తప్పుకున్న రాహుల్.. ఓ మెలిక పెట్టాడు. తాను పోతే పోయానుగానీ ఇక ప్రెసిడెంట్‌గా మాత్రం నెహ్రూ కుటుంబీకులెవర్నీ పెట్టొద్దని. అక్కడే ప్రియాంకపై ఉన్న కుళ్లు కనిపడింది. ఆమెకు ఇస్తే ఇక తనకు రాజకీయంగా ఉనికే ఉండదనుకున్నాడు. కానీ తన వల్ల పార్టీ ఉనికే పోతుందని తెలిసినా మారడం లేదు. మార్పు రాలేదు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండయి బీజేపీలో చేరిన ఓ నేత ఓ టీవీ ఇంటర్వూలో చెప్పాడు. రాహుల్ ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని. అంతే కాదు.. రాహుల్ సోనియాకు కొడుకుగా పుట్టాడు కాబట్టి ఇలా చలామణి అవుతున్నాడని, లేకపోతే చప్రాసీగా కూడా పనికిరాడని. ఇగో ఇలా కొందరు వాస్తవాలు చేదుగానే చెబుతారు. కానీ వాటిని చాలా మంది జీర్ణించుకోరు. వాస్తవాలు గ్రహించారు. మేల్కోరు. రియలైజ్ కాకపోతే పాతాళానికి పడిపోతుంటే చూడాలి తప్ప చేసేదేం లేదు కదా. ఇదే హరియాణాలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారం చేసింది. బీజేపీతో సమానంగా కాంగ్రెస్ సీట్లు సాధించింది. అసెంబ్లీ సీట్లు.. బీజేపీ కన్నా ఎక్కువ సాధించింది. మరిప్పుడెందుకు తగ్గాయి..? పోస్టుమార్టం జరగదు. అంతా రాహుల్ గాంధీ జపమే ఉంటుంది.
అందుకే పార్టీ ముందట పడటం లేదు. జమ్ము కాశ్మీర్లోగా ప్రాంతీయ పార్టీల దయాదాక్షణ్యాలతో అధికారంలోకి వచ్చామా..? అంటే వచ్చాం. అంతే. మోడీని బతికించి, బీజేపీకి ప్రాణం పోస్తున్నది రాహుల్ కాదా..? సోనియాకు ఇవన్నీ తెలుసు. కానీ ఆమె కళ్లుండీ చూడలేదు. తెలిసీ చెప్పలేదు. కొడుకు మాట జవదాటలేదు. పార్టీని కాపాడలేదు.
