(దండుగుల శ్రీనివాస్)
అధికారం రాకముందు ఒకలా.. వచ్చినంక ఇంకోలా… ఇది పాలకులకు అలవాటుగా మారింది. ఒక కేసీఆర్ .. ఒక రేవంత్ సేమ్ టు సేమ్ ఇలాగే కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీడియాతో చాలా దగ్గరగా ఉండెటోడు కేసీఆర్. కలిసి భోజనం చేసేటోడు. తియ్యగా మాట్లాడెటివాడు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం దగ్గరకు రానీయలేదు. ప్లాట్లిస్తాం.. మోడల్ త్రిపుల్ బెడ్ రూంలు ఇస్తాం.. అని మాటలు చెప్పి కాలం గడిపిండు తప్ప ఎవరికీ ఏమీ చేయలేదు. బీఆరెస్ హయంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన సెక్షన్‌లో మీడియా కూడా ఒకటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లనే చేస్తున్నడు.
యూట్యూబ్ గొట్టంగాళ్లయ్యారు అధికారంలోకి రాగానే. మీడియా విషయంలో ఎంత ఆచితూచి మాట్లాడితే అంత మంచిది రేవంత్‌కు. ఇక ఇప్పుడు చెప్పొచ్చే ముచ్చటేమిటంటే.. కరీంనగర్‌లో జర్నలిస్టులకు ఇచ్చిన ప్లాట్లను ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందనేది వార్త. దీనిపై బండి సంజయ్. కేటీఆర్ భగ్గుమన్నారు. అయినా ఇందులో పార్టీల ఉనికేముంది. అందరి జర్నలిస్టులకు ఇచ్చేశారు. నిజామాబాద్‌లో కూడా కవిత ఇచ్చినట్టే ఇచ్చి ఆశ చూపి ఆవల గడ్డెక్కింది. జర్నలిస్టులతో రేవంత్‌కు మంచి సంబంధాలు లేవని చెప్పడానికి నిన్న జరిగిన ఓ చిన్న ఉదంతమే నిదర్శనం. మూసీ ప్రక్షాళన ఆగేదే లేదని ఆయన చేసిన ప్రసంగంలో మూసీ నది పేరును తమ బిడ్డలకు పెట్టుకోవాలని ఆయన సూచించారు.
ఇప్పటి వరకు ఎవరూ పెట్టుకోలేదని కూడా చెప్పాడు. కానీ తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్టు పిట్టల శ్రీశైలం తన బిడ్డ పేరును మూసీ అని ముద్దుగా పెట్టుకున్నాడు. మూసీకి ఉన్న ప్రాశస్థ్యం, ఆ నది నేపథ్యం ఆయనకు తెలుసు కాబట్టే ఆ పేరు పెట్టుకున్నాడు. అంతే కాదు తను మూసీ టీవీ అని కూడా ఓ మీడియాను రన్ చేస్తున్నాడు. ఇది రేవంత్‌కు తెలియపోయినా.. ఆయన వద్ద పనిచేసే సీపీఆర్వో అయోధ్యరెడ్డికైనా తెలుసుండాలె కదా. అంటే ఎవరి మాటలు, సలహాలు, సూచనలు కూడా తీసుకున్నట్టు లేదు సేమ్ టు సేమ్ కేసీఆర్ లాగా.