(దండుగుల శ్రీనివాస్)
బీఆరెస్‌కు ఇదో చేదువార్త. ఇప్పుడిప్పుడే చచ్చిన పార్టీకి జీవం లభిస్తోంది. దీనికి కారణం హైడ్రా, తాజాగా మూసీ. ఇకపై రుణమాఫీ.. ఇలా కాంగ్రెస్ సర్కార్ తప్పుల తడకల పాలన, అనాలోచిత నిర్ణయాలు బీఆరెస్‌పై వ్యతిరేకతను తగ్గిస్తుండగా, ప్రభుత్వంపై పెంచుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ మేల్కొన్నది. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న కమలనాథులు, మోడీ పరోక్ష, ప్రత్యక్ష పిలుపుతో ఇక తెలంగాణలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యారు. రైతుదీక్ష చేపట్టారు. మూసీ బాధితుల కోసం పర్యటనలు మొదలుపెట్టారు. అయినా బీజేపీకి పెద్దగా మైలేజీ రావడం లేదు.
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎంతలా గగ్గోలు పెట్టే ప్రయత్నం చేసినా జనాలు అంతలా దాన్ని విశ్వసించడం లేదు. మెల్లగా బీఆరెస్ పుంజుకుంటున్న క్రమంలో.. సరిగ్గా ఎంటర్ ది డ్రాగన్ లా చంద్రబాబు ఎంటర్ అయ్యాడు. మొన్నటి దాకా ఏపీలో వరదలు, తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో తలమునకలై, ముప్పుతిప్పలు పడుతున్నా.. బాబు రాజకీయం చేయడం మాత్రం మానలేదు. సోమవారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి , మల్లారెడ్డి, మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిలు చంద్రబాబును కలిశారు. టీడీపీలో వీరంతా చేరనున్నారు. తీగల క్లారిటీ ఇచ్చేశాడు. ఇక చాలా మంది బీఆరెస్ లీడర్లు ఇదే బాటలో కొనసాగనున్నారు.
బీఆరెస్ వైఖరికి, కేసీఆర్ తీరుకు విసిగి వేసారి ఉన్న వారిలో కొద్ది మంది కాంగ్రెస్‌కు వెళ్లారు. మిగిలిన వారు ఎటూ దారిలేక తలోదిక్కు చూస్తున్న తరుణంలో బాబు ఎంట్రీ ఇచ్చాడు. రానున్న రోజుల్లో బీజేపీ, టీడీపీ ఇక్కడ పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీజేపీకి టీడీపీ తోడైతే ఇక రానున్నది బీజేపీ ప్రభుత్వమేననే అంచనాలో వారున్నారు. ఇదే సమీకరణలో భాగంగా పొలిటికల్ చౌరస్తాలో ఉన్న నేతలంతా టీడీపీ పంచన, బాబు నీడన చేరనున్నారు. ఇప్పుడిది బీఆరెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.