(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ చేసిన అల్లరి చిల్లర రాజకీయాలను మరింత దిగజార్చి ఇప్పుడు రచ్చ రాజకీయం చేస్తోంది కాంగ్రెస్. ఇప్పుడు స్టేట్‌లో నడుస్తున్న రాజకీయాలను చూస్తే ఆంధ్ర చీప్ పాలిటిక్స్ గుర్తొస్తున్నాయి ఇక్కడి జనానికి. రాజకీయ పునరేకీకరణ పేరుతో ఫక్తు రాజకీయం అనే నినాదంతో కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించాడు. కావాల్సినంత సంఖ్యాబలం ఉన్నా ఎక్కడో ఏదో భయం. కేసీఆర్ బటయకు కనిపించేంత, చూపించే గంభీరత అంతా నేతి బీరకాయ చందమే. ఆ పిరికి కాస్తా ఎడాపెడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వరకు వెళ్లింది.
ప్రతిపక్షం కాంగ్రెస్‌ను లేకుండ చేశాడు కేసీఆర్. రాజనీతిజ్ఞుడు అని , అపర చాణక్యుడు అని డప్పు కొట్టించుకునే కేసీఆర్ అదే రాజకీయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాశాడు. అదంతా ఒక్కప్పటి లెక్క. మరిప్పుడేం నడుస్తోంది. సేమ్ అదే పంథాలో పోతున్నారు కాంగ్రెస్ నాయకులు. మేమేమన్నా తక్కువ తిన్నామా అంటూ మరో అడుగు ముందుకేసి రచ్చ రాజకీయమే చేస్తున్నారు. కానీ ఇక్కడ కేసీఆర్‌లాగే వీళ్లూ భయపడుతున్నారు. ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు డేర్‌గా ఫైట్ చేయొచ్చు కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై కోర్టు మెట్లెక్కలేదు. ఇప్పుడు వీళ్లెక్కారు. అనర్హత వేటు అనే పదం రాగానే కాంగ్రెస్ మాట్లాడే మాటలు, చేష్టలు ప్రజలకు ఏవగింపు కలిగేలా చేస్తున్నారు.
ఉప ఎన్నికలు వస్తే ఫైట్ చేసి గెలవచ్చు కదా. ఇది మరింత హుందాగానే ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, కష్ట తరంగా ఉన్న పరిపాలన కారణంగా కాంగ్రెస్ దాని జోలికి పోవద్దనే నిర్ణయం తీసుకున్నది. అందుకే పార్టీ మారలేదు. మేం అందులోనే ఉన్నామనే టెక్నికల్ పాయింట్‌ను ఆధారం చేసుకుని రాజకీయం నడుపుతోంది. ఇదే జనాలకు ఈ రాజకీయాలంటే మరీ ఏవగింపు కలిగేలా చేస్తున్నాయి. ఫక్కా ఆంధ్ర రాజకీయాలను తలపించేలా చేస్తున్నది కాంగ్రెస్ అనే కామెంట్లూ వస్తున్నాయి. పార్టీ మారుతూ మేం అందులోనే ఉన్నామని చెప్పుకోవడం జనాల చెవ్వుల్లో పువ్వులు పెట్టడం కాదా..? అవును.. అప్పుడు వాళ్లు చేశారు దాన్నెవరూ అంగీకరించలేదు. అందుకే మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ తీరుపై మండిపడి కర్రుకాల్చి వాత పెట్టారు. కాంగ్రెస్‌ను ఏరికోరి తెచ్చుకున్నారు. వీళ్లూ అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తే ఇక రాజకీయాలంటే ఏవగింపే కాదా..? రేవంత్ కూడా ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నట్టు కనిపిస్తున్నాడు.
ఇది మంచిది కాదు. హుందాగా రాజకీయాలను నడపాల్సిన అనివార్యత ఉంది. ఇప్పటికే ఇచ్చిన హామీలెన్నో ఉన్నాయి. వాటిపై ప్రజలు విపరీతంగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. వ్యతిరేకత, గ్యాప్ పెరిగేక్రమంలో దీన్ని తగ్గించుకుని జనాల అభిమానాన్ని చూరగొనాల్సిన పరిస్థితుల్లో ఇలా రచ్చ రాజకీయం కోసం కాలు దువ్వడం ఎవరూ హర్షించేది కాదు. పాడి కౌషిక్‌రెడ్డిపై జనానికి ఏమాత్రం సానుభూతి లేదు. ఎందుకంటే అతని బ్లాక్‌మెయిలింగ్ రాజకీయం జనం చూశారు. ఇదో అన్నాడని, మనం ఏమాత్రం తగ్గొద్దనే రీతిలో రెచ్చిపోవడం బీఆరెస్‌కు కలిసి వచ్చే అంశమే తప్ప… కాంగ్రెస్ కు కాదు. సైలెంట్ తాము చేయాల్సిన పనులు తాము చేసుకుంటూ పోవడమే కాంగ్రెస్ సర్కార్‌కు ఉత్తమమైన పని. ఇప్పుడు బీఆరెస్‌కు ప్రతిపక్ష పార్టీ. అది చేసే పని అది చేస్తుంది. చెప్పాల్సిన సమాధానం సరైన సమయంలో చేతల ద్వారా చెబితే సరిపోతుంది. అది జనం గ్రహిస్తారు. మెచ్చుకుంటారు. అంతే తప్ప ఇలాంటి రచ్చ రాజకీయాన్ని ఎంజాయ్ చేసే మూడ్‌లో జనం లేరు. వారి బాధలు చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోండి ఫస్టు.