(దండుగుల శ్రీనివాస్)
కాలి బూదిదైన తరువాత తేరుకున్నారు. కరోనా వేళ ఉద్యోగులను రోడ్డు పాలు చేసినా పట్టించుకోని పాలిత చక్రవర్తులు ఆనాడు కిమ్మనలేదు. అధికార పీఠంపై హాయిగా సేద తీరి ఇప్పుడు తాము రోడ్డుకెక్కగానే పత్రిక బాగోగులు హాఠాత్తుగా గుర్తొచ్చాయి. సారీ.. సారీ! అంటు లెంపకాయలేసుకుంటున్నారు. ఇకపై ఇలా జరగదంటూ ప్రామిస్ కూడా చేసేశారు. మనమంతా ఒక్కటి కలిసి పనిచేద్దామని శపథవిన్యాసాలు చేసి కొత్త ఊపిరిలూదే ప్రయత్నాలూ జరిగినాయయో..! ఇదంతా సోది ఎవరి కోసం.. దేని కోసం గానీ ..! అసలు విషయానికొద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక కార్యాలయంలోకి యువ నేత కేటీఆర్ చాలా ఏళ్ల తరువాత కాలు మోపాడంట. ఇదా వార్తా..? అయితే మాకేంటీ..? సరే ఈ వార్త అందరికీ పట్టదు కానీ. వినండి. కాదు చదవండి. ఈ కేటీఆర్ తెగ పశ్చాత్తాపపడ్డాడట. ఎందుకో..? అదేనయ్యా నమస్తే తెలంగాణ ఉద్యోగులను అస్సలు పట్టించుకులేదు మా బీఆరెస్ కార్యకర్తల్లాగా అని అన్నాడట. అయితే..?. చెప్తానుండయ్యా బాబు. ఇకపై మనం కలిసిమెలిసి పనిచేసి బా..గా పేపర్‌ను వృద్ధిలోకి తెద్దాం అన్నాడట. తెచ్చుకోని. మాకేంటీ..? అహ మాకేంటట.! సరే… సరే .. అక్కడికే వస్తున్నా…!
ఎడిటర్ కట్టాశేఖర్‌రెడ్డిని పీకేసీ.. కొత్తగా ఓ పంతులు.. కృష్ణమూర్తిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు కేసీఆర్. ఇగ అక్కడ్నుంచి మొదలైంది సూడు కత. పీకేసుడే పీకేసుడు. అరే జర కరోనా వచ్చిందిరా బై. బయట వుజ్జోగాలు కూడా లేవు. బతుకుడే కష్టంగా ఉందన్నా కూడా కరగలేదా కర్కోటకుడు. ఎడాపెడా వందల మందిని పీకేసీ ఆ పాపాన్ని ఆడు ఆ పత్రిక యాజమాన్యం మూటగట్టకుందా.? ఆనాడు ఈ చిన్నోడు, పెద్దోడు ఎవలూ పట్టించుకోలే. అలా వినీ విననట్టు, చూసీ చూడనట్టు. అసలు మాకేం పట్టనే పట్టనట్టు ఉన్నారు.
ఇదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఈ కృ.తి చేతిలో రోడ్డు పాలైన జర్నలిస్టులను తెలంగాన కలం యోధులని కీర్తించాడు. అధికారం వచ్చింది. ఆ తరువాత పత్తాలేడు. ఇలా ఈ ఉద్యోగాలు ఊడబీకుడు, తనకు కావాల్సిన ఆంధ్ర టీమ్‌ను నింపుకునుడు.. యథేచ్చగా ఏళ్ల తరబడి.. అంటే నిన్నటి వరకు యాప్పీగా సాగుతూ వచ్చింది. కోనై అంటోడు లేడనుకో. అలా సాగింది కృ.తికి. అలా సాతిచ్చారు పెద్దాయన, చిన్నాయన. అధికారం పాయె. పత్రిక మళ్లా దిక్కాయె. మొన్నటికి మొన్న గ్రూప్ -1 ఉద్యోగాల మీద టీజీపీఎస్సీ వైఖరిపై అంతా దుమ్మెత్తిపోస్తుంటే .. నమస్తే మాత్రం సర్కార్‌కు నమస్తే పెడుతూ మంచి ఆర్టికల్ ఒకటి పరిచేసింది. ఇగ అప్పుడు సెగ తగిలింది చిన్నసారుకు.
ఇక ఆగమేఘాల మీద ఇలా వచ్చి మీటింగు పెట్టాడన్నమాట. ఇక నుంచి ఉద్యోగాలు తీసేయం సరేనా..? అని వారికి హామి కూడా ఇచ్చి బాగా చేసుకుందాం. పెద్దసారు కూడా ఇక దీనిపై నజర్ పెడతాడు అని చెప్పి నెలలో ఒకట్రెండు సార్లు ఒచ్చిపోతా సుమా అని నచ్చజెప్పి పోయిండంట. సారీ మిమ్మల్సి ఇన్నాళ్లూ పట్టించుకోలె … అని పోతూ పోతూ తిరిగి తిరిగి చూస్తూ చెప్పి పోయిండంట. గిదీ సంగతి. గింతే! ఊడబీకినోడు బాగానే ఉన్నడు. సల్లగా ఒడ్డుమీదుండి సూసినోడు సక్కంగానే ఉన్నడు. దీన్ని నమ్ముకుని వచ్చి కుటుంబాలకు కుటుంబాలు రోడ్డున పడ్డోళ్లే కనిపిస్తలేరు. బతికున్నరో సచ్చిండ్రో.. పాపం..!