యోగీ…బిడ్డెను చంపిన హంత‌కుడివి నీవు.. !

ఎంతో మంది చీక‌టి బ‌తుకుల‌ను చూసిన నువ్వు.. వారి బ‌తుకుల్లో వెలుగుల కోసం ప‌రిత‌పించిన నువ్వు.. స‌త్య‌మేవ జ‌య‌తే అని బ‌లంగా నమ్మిన నువ్వు… చివ‌ర‌కు క‌న్న‌బిడ్డెను క‌డుపున పెట్టుకుంటావ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

స‌మాజాన్ని నీ క‌ళ్ల‌తో చూసిన నువ్వు నీ ఇంట్లో స‌మ‌స్య‌లు పెద్ద ఆగాధంలా క‌నిపించాయి. ఇదే బ‌య‌ట జ‌రిగి ఉంటే నీకు ఎంత చిన్న విష‌య‌మో.. చిటికెల నువ్వు స‌మ‌స్య ప‌రిష్కరించేలా నీ ఆలోచ‌న‌లు ఉండేవి. పెద్ద మ‌నుసు చేసుకుని ఎలా ఆ స‌మ‌స్య‌నుంచి బ‌య‌ట‌ప‌డాలో వివ‌రించే వాడివి. కానీ అది స్వ‌యంగా ఇప్పుడు నిన్నే తాకింది. త‌న‌దాక వ‌స్తే అన్న‌ట్టు అప్పుడే క‌దా మ‌న‌లోని మ‌న‌స వికాసం బ‌య‌ట‌ప‌డేది. కానీ ఇక్క‌డ నీ విష‌యంలో బ‌య‌ట ప‌డింది మ‌నోవికారం.

అపార్థాలేమైనా కావొచ్చు. అనుమానం పెనుభూత‌మై నిన్ను ద‌హించ‌వ‌చ్చు. నిద్ర‌లేని రాత్రులు గడిపేలా నిన్ను న‌ర‌కం చ‌విచ‌సేలా చేసి ఉండ‌వ‌చ్చు. విలేక‌రి ఉద్యోగం ఊడి ఆర్థిక ఇబ్బందులూ నిన్ను వెంటాడుతూ ఉండొచ్చు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణ‌యం మాత్రం చాలా ఘోరం. ఓ క్రిమిన‌ల్ క‌న్నా ఘోరంగా నువ్వు ఆలోచించావు. ఆవేశంలో నిర్ణ‌యం తీసుకుని ఉండ‌వ‌చ్చు.. కానీ దాన్ని ఆచ‌రించి చూపావు. పాలుగారే ఆ చిన్నారి బ‌తుకును అంత‌మొందించేంతంగా నీ హృద‌యాన్ని ఎందుకంత క‌ఠినం చేసుకున్నావు…? ఏ స‌మ‌స్య‌కైనా ప‌రిష్క‌రం ఒక‌టి ఉంటుంద‌ని న‌మ్మిన‌వాడివే క‌దా.

కానీ ఇక్క‌డ అది నీ ఫ్యామిలీ స‌మ‌స్య అయి ఉండ‌వ‌చ్చు. అయినంత మాత్రం ప్రాణాలు తీసుకుంటే త‌ప్ప ప‌రిష్కారం లేద‌ని భావించావా..? ఇదేనా ఇన్నాళ్లూ నీలో ప్రోది చేసుకుని ఉన్న భావ‌జాలం. భార్యను ఒంట‌రి చేసి ప్ర‌తీకారం తీర్చుకుందామ‌నుకున్నావా..? ప్ర‌తీకారేచ్చ ఎవ‌రిపై.. నీతో క‌లిసి బ‌తికిన స‌హ‌చ‌రిపైనే. ప్రాణాలంత‌మొందించే ప‌గ ఎవ‌రిపైన నీ క‌నుపాపైన క‌న్న‌బిడ్డ‌పైనా…? విలేక‌రుల బ‌తుకులు ఘోర‌మే .. హీన‌మే. కానీ ఆలోచ‌న‌ల్లో కూడా హీనంగా ఉండాలా..? నీలా..? విషాదం. ఇలా జ‌రిగిండాల్సింది కాదు..

(దండుగుల శ్రీ‌నివాస్‌)
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు

 

You missed