రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ మృతి వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. 2016లో మంత్రి తండ్రి దివంగత రైతు నేత సురేందర్ రెడ్డి మృతి చెందారు. తనకు ప్రజాసేవ మార్గాన్ని చూపించి దిశ నిర్దేశం చేసిన తండ్రి వేముల సురేందర్ రెడ్డి మృతిని మరువక ముందే తన తల్లి సైతం అనారోగ్యం బారిన పడి మృతి చెందడం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆయన సోదరుడు అజయ్ రెడ్డిని, కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదన భరితం చేసింది. మంజులమ్మ తన భర్త వేముల సురేందర్ రెడ్డి ప్రజాసేవ రాజకీయాల్లో కొనసాగుతూ ఉంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇల్లాలిగా ప్రోత్సహిస్తూ వచ్చింది.

భర్త నిత్యం రైతు సేవలో మునిగి ఉన్నా తన కొడుకులు బిడ్డల ఉన్నత చదువులు చదివేలా ఉద్యోగాలు సాధించేలా పెద్దకొడుకు ప్రశాంత్ రెడ్డి తండ్రి అడుగుజాడల్లో నడిస్తే ప్రోత్సహించేలా తన బాధ్యతలను నిర్వర్తించారు మంజులమ్మ. తన కళ్ళ ముందే సుదీర్ఘ రైతు, రాజకీయ పోరాటాల బాట నడిచిన తన భర్త ఆశయాలు నెరవేరి.. తమ పెద్ద కొడుకు ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందం కొనసాగుతున్న అనతి కాలంలోనే సురేందర్ రెడ్డి మృతి ఆమె జీవితంలో విషాదాన్ని నింపింది.

ఆ తర్వాత కొద్దికాలంలోనే ఆమె సైతం అనారోగ్యం బారిన పడింది. అప్పటి నుంచి మంత్రి వేముల తన తల్లి అనారోగ్య పరిస్థితులు తో ఒకవైపు బాధపడుతూనే ఆ బాధను బయటకు కనబడనీయకుండా మంత్రిగా ప్రజలకు తన బాధ్యతలను నెరవేరుస్తూ వచ్చారు. మంత్రి, ఆయన సోదరుడు అజయ్ రెడ్డి, సోదరి రాధికా రెడ్డి కుటుంబ సభ్యులు మంజులమ్మకు చికిత్స అందిస్తూనే కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వేల్పూర్ లో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

వేముల తల్లి మృతి పట్ల సీఎం కెసిఆర్ సంతాపం

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ మృతి పట్ల సీఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాదు జిల్లా ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు

You missed