ఎన్నికల కోడ్‌ చాలా మంది పేదల ఆశలపై నీళ్లు పోసింది. కొత్త పింఛన్ల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని కలెక్టరేట్‌ చుట్టూ ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూ వస్తున్నారు. దరఖాస్తులు తీసుకున్నారు. వాటిని అలాగే పెట్టేశారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు సిగ్నల్‌ వస్తే అప్పుడు కొత్త వారికి ఇద్దామని అధికారులు కూడా వేచి చూస్తున్నారు. కానీ కోడ్‌ రానే వచ్చింది. ఈ దరఖాస్తులన్నీ అటకెక్కాయి. బీడీ కార్మికులకు కటాఫ్‌ డేట్‌ ఎత్తివేయడంతో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్క నిజామాబాద్‌లోనే ఇరవై వేల మంది వరకు దరఖాస్తు దారులు బీడీ పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎంతో మంది ఆసరా పింఛన్‌ కోసం వేచి చూస్తన్నారు. వీరంతా ఎన్నికల ముందైనా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశించారు. తీరా ఎన్నికల షెడ్యూల్‌ రానే వచ్చింది.

కోడ్‌ కూయనే కూసింది. దీంతో కొత్త పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. ఇక మళ్లీ గవర్నమెంట్‌ ఏర్పడాలి… ఆ తర్వాత ఆ ప్రభుత్వం స్పందించాలి. ఆ సమయం ఎలా ఉంటుందో.. ఇంకెంతకాలం వెయిట్‌ చేయాలో.. తెలియదు. ఈ నీరిక్షణ ఇంకా కొనసాగనుంది. ఈ ఆశల ఎదురుచూపులు కంటిన్యూ కానున్నాయి. కొత్త రేషన్‌ కార్డుల పరిస్థితి కూడా అంతే. పేర్ల మార్పులు, కొత్తగా రేషన్‌కార్డుల కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఈ పోర్టల్‌ నుంచి బంద్‌ చేసి ఏళ్లు అవుతుంది. దీనికి కూడా అధికారులు ఎన్నికల ముందు చేస్తారని చెబుతూ వచ్చారు. తీరా ఆ సమయమూ వచ్చేసింది. కోడ్‌ వచ్చి ముంగిట్లో కూసుంది. కొత్త రేషన్‌ కార్డుల పోర్టల్‌ను ఓపెన్ చేయలేదు. ఆదేశాలు రాలేదు. ఇప్పుడు వచ్చే అవకాశాలూ లేవు. దీంతో ఈ రెండింటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది పేదలకు ప్రభుత్వ వైఖరి తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇంత కాలం ఓపిక పట్టారు కదా.. ఇంకో రెండు మూడు నెలలు ఓపిక పట్టలేరా… అనే సమాధానం వస్తుంది అధికార పార్టీ నుంచి.

కానీ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి విసిగి వేసారిపోయిన పేదలకు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి ఉంది. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓవైపు దళితబంధు కష్టాలు అధికార పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. గృహలక్ష్మీ కోసం ఎదురుచూసిన వారికీ నిరాశే ఎదురైంది. కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్‌ చెక్కులకూ కోడ్‌ గ్రహణం పట్టుకున్నది. డబుల్‌ బెడ్‌ రూంలు రాకనే పాయే. గతంలో హుజురాబాద్‌ ఉప ఎన్నికలకు ముందు అప్పటికప్పుడు హడావుడిగా దళితబంధు ఇచ్చేశారు. కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేశారు. కానీ అది ఒక్క నియోజకవర్గమే కావడంతో ఖర్చులు భరించారు. ఇప్పుడు ఏ పథకం తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి.. నిధులు లేవు.. అందుకే ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని తెలిసీ, కోడ్‌ మీద పడుతుందనీ గ్రహించినా.. కావాలనే ప్రభుత్వం దీన్ని విస్మరించింది. పేదలకు చేతిచ్చింది.

You missed